ఉదాత్తగుణాలన్నిటినీ షేక్స్పియర్ రాశీభూతంచేసి రూపకంలో ప్రదర్శించాడు. పరమోదాత్తమైన అతని వ్యక్తిత్వం పతనావస్థలో సహితం మనలను ఆకర్షిస్తున్నది. ఆంటోనీయెడ ఆక్టేవియా చూపిన భక్తివిశ్వాసాలు మూలంలో విశేషంగా ప్రదర్శితాలైనాయి. వాటిని యథాతథంగా నిరూపిస్తే అంటోనీ క్లియోపాత్రా ప్రేమబంధానికి విరతి కలుగుతుంది కనుక షేక్స్పియర్ వాటన్నిటినీ విడిచిపెట్టి, నాయికానాయకుల ప్రణయైకజీవితానికి ప్రాచుర్యాన్ని కల్గించే అంశాలకే ప్రాముఖ్యాన్నిచ్చాడు. ఈ కారణంవల్లనే ఆంటోనీ సర్వప్రపంచ సాహిత్యాలల్లోని ప్రేమికులందరిలో అతివిశిష్టుడన్న విఖ్యాతి గడించుకోగలిగాడు.
"షేక్స్పియర్ రచించిన చరిత్రాత్మక నాటకాలన్నిటిలో “ఆంటోనీ - క్లియోపాత్రా” అద్భుతావహమైంది” అన్నాడు కోల్రిడ్జి పండితుడు. ఆయన అన్నట్లు ఇది ఒక చరిత్రాత్మక రూపకం. ఇందులో నాటకకర్త అతి సూక్ష్మాంశాలను గూడా ఎంతో సన్నిహితంగా అనుసరించాడు. ఇది కేవలం చరిత్రే కాదు ఒక ప్రణయకావ్యం కూడాను. నాయికానాయకుల ప్రణయ ప్రవర్తనలోని నీత్యవినీతులమీదికి మనదృష్టిని అణుమాత్రమైనా ప్రసరించకుండా, ఇంద్రజాలికమైన తన ప్రతిభతో షేక్స్పియర్ ఒక రమణీయమైన యవనికను సృజించి మభ్యపెట్టాడు. ఇందులోని ఆంటోనీ క్లియోపాత్రాలు ఒకరికొకరు దేవతలు. తప్పనిసరియై తానే మృత్యువు నాహ్వానించి లొంగిపోయిన క్లియోపాత్రా కూడా, తుదకు ఏదో విజయాన్ని సాధించిందన్న భ్రాంతి మనకు కలిగించి తీరుతుంది. ధర్మేతరప్రణయాన్ని ఆరాధించిన నాయికానాయకుల మీద మనకు గౌరవాభిమానాలు కలిగేటట్టు చేసిన షేక్స్పియర్ అవినీతిప్రవర్తకుడని అనుకోటానికి అవకాశం లేదు. ఆయన అత్యుత్తమ నీతిప్రతిపాదకుడు. బలసౌందర్యాల కైనా కొంత అవధి, కాలం మాత్రం ఉంటాయనీ, చెడువల్ల మంచి ఎప్పుడూ సంప్రాప్తించదనీ, కాంతాసమ్మితతయా ఉపదేశించి ఈ రూపకమూలంగా ఆయన ఒక ఉత్తమనీతినే ప్రబోధించాడు. అయితే ఆయన ఆంటోనీ - క్లియోపాత్రాల కామతౌల్య విలాసవ్యాపారాలకు ఎటువంటి లోటునూ కల్పించలేదు. అది శిల్పదృష్ట్యా ఒక లోపం కూడాను.
ఆంటోనీ - క్లియోపాత్రా - నేత
రోమక నాటకాలలో చరిత్రికాంశాలను మలచటంలోనూ, తత్కాలీనమైన వాతావరణాన్ని కల్పించటంలోనూ మహాకవి షేక్స్పియర్ విశేషశ్రద్ధ వహించాడు. అయినప్పటికీ కథాకాలంనాటి రోమకవ్యక్తుల మానవత్వాన్ని దర్శించి ప్రదర్శించటమే
152
వావిలాల సోమయాజులు సాహిత్యం-3