Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యతిరేకించిందని అనలేం. తరువాత అనతికాలంలోనే అతనిపక్షం నుంచి సైనికులు కొందరు వెళ్ళిపోయి శత్రుపక్షంలో చేరినప్పటికీ, ఇంకా అతనికి ఈజిప్టునుంచి ఆక్టేవియను ఎదుర్కొనే అంగబలం ఉండనేఉంది. అనాలోచితంగా అతడు సంధియత్నం ఆరంభించాడు. విజేతఅయిన ఆక్టేవియస్ ఆంటోనీని విడిచిపెట్టమని క్లియోపాత్రాను కోరటం, ఆమె నిరాకరించటం, ఆక్టేవియస్ అలెగ్జాండ్రియా మీదికి ఎత్తిరావటం సంభవించాయి. అలెగ్జాండ్రియా యుద్ధంలో తొలినాడు ఆంటోనీకి స్వల్ప విజయం సంప్రాప్తించినా, మరునాడు అతని నౌకలు మోసగించటంవల్ల ఆంటోనీ పూర్తిగా ఓడిపోవటమూ, ఆక్టేవియస్కు పరిపూర్ణవిజయం లభించటం జరుగుతుంది. క్లియోపాత్రా అసత్యమరణవార్తను విని ఆంటోనీ ఆత్మహత్యకు పూనుకోవటం, ఖడ్గం సరియైన ఘాతను కల్పించకపోవటం చేత కేవలం బలమైన గాయం తగలటమేగాని, ప్రాణాలు కొంతసేపటిదాకా పోకపోవటం, అతణ్ణి క్లియోపాత్రా ఉన్న సమాధి నిర్మాణం దగ్గరికి చేర్చటం, అతడు క్లియోపాత్రా మరణం అసత్యమని గమనించటం, అక్కడ అతడు క్లియోపాత్రా బాహువుల్లోనే మరణించటం జరుగుతాయి. ఆక్టేవియస్ సీజర్కు విజయచిహ్నంగా జీవించదలచుకోక క్లియోపాత్రా ఆంటోనీని అనుసరించటానికి నిశ్చయించి 'కీటకం' చేత కరిపించుకొని ప్రాణపరిత్యాగం చెయ్యటంతో ఆమె జీవితం పరిసమాప్తమవుతుంది. కరుణారసభూయిష్ఠమైన ఆ ప్రదేశానికి వచ్చిన ఆక్టేవియస్, సైనికగౌరవాలతో ఆంటోనీ, క్లియోపాత్రాలకు అంత్యక్రియలను జరిపించటంతో “ఆంటోనీ - క్లియోపాత్రా" రూపకం పరిసమాప్తమవుతుంది.

నాటక నిర్మాణం

అత్యుత్తమ శ్రేణికి చెందిన షేక్స్పియర్ మహాకవి రచనల్లో 'ఆంటోనీ క్లియోపాత్రా' ఒక విశిష్టస్థానాన్ని గడించుకొన్నది. ఇంత అప్రయత్నంగా రచయిత అంతరంగంనుంచి వెలువడ్డదిగాని, ఇంతగా చరిత్రాత్మకమైంది గాని షేక్స్పియర్ రచనల్లో మరొకటి లేదని అనిపించుకొన్నది. ఆ రూపకంలోని పాత్రలనే పునః ప్రదర్శించటం చేతనూ, కథాగమన విషయంలో దానికీ దీనికీ అత్యంతసామ్యం, సాన్నిహిత్యం ఉండటంచేతను 'జూలియస్ సీజర్'తో 'ఆంటోనీ - క్లియోపాత్రా'కు కొంత సంబంధం ఉన్నట్లు వ్యక్తమౌతుంది. కానీ దానికీ దీనికీ, స్వభావంలో ఎంతో విభేదముంది. జూలియస్ సీజర్లో కర్తవ్య పాలనమనే ఆదర్శం ప్రముఖ స్థానాన్ని వహించింది. ఆంటోనీ - క్లియోపాత్రాలో ఐంద్రియకాముకత్వానికీ, అతిశయమైన స్వార్థపరత్వానికీ జరిగిన సంఘర్షణ ప్రదర్శితమైంది. జూలియస్ సీజర్లోని బ్రూటస్ ను


150

వావిలాల సోమయాజులు సాహిత్యం-3