ఆంటోనీ - క్లియోపాత్రాలోని ప్రణయకథకూ కొంత సంబంధమున్నదనీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ సంబంధానికి విశేష గౌరవం ఇచ్చే అవకాశం లేదు. షేక్స్ పియర్ యౌవనదశలో నడిచిన ప్రణయమూ, ఆంటోనీ ప్రణయమూ రెండూ ధర్మేతరాలు. గీతాలలోని నీలవర్ణ, నాటకంలోని క్లియోపాత్రాకు మూలమని అనటానికి అవకాశం లేదు. ఆమె ప్లూటార్క్ లభించిన క్లియోపాత్రాయే. అయినా గీతాలలోని నీలవర్ణకు సంబంధించిన స్మృతులు షేక్స్ పియర్ కు జీవితాలలోని క్లియోపాత్రా పాత్రలోని కవితను వ్యక్తం చేసి ఉండవచ్చు. గీతాలలోని నీలవర్ణలాగానే షేక్స్ పియర్ క్లియోపాత్రా నీలవర్ణం అయి ఉండటం గీతాలకూ, నాటకానికీ ఉన్న సామ్యం. ప్రాచ్యమైన జ్యోతిష్మతీత్వంతోను, అపురూప సౌందర్యంతోను, అనన్యసాధారణచంచల విలాసాలతోనూ, భోగపరతంత్రతతోనూ మభ్యపెట్టి, తన దోషాలమీదికి ఆంటోనీ మనస్సును మరలనీయకుండా చేసి, అతణ్ణి పాలించిన 'ప్రాక్తార' క్లియోపాత్రా చరిత్రలోని వ్యక్తే గాని, షేక్స్ పియర్ చిత్తాన్ని క్షుభితం చేసిన నీలవర్ణ కాజాలదు. ఆంటోనీ క్లియోపాత్రా ప్రణయపరిణామాన్ని చిత్రించటంలో షేక్స్పియరు కొంతగా తన ప్రణయకథ తోడ్పడి ఉండవచ్చు. దీనినిబట్టి నాటకంలో ప్రతిబింబితమైన నాటకకర్త ఆత్మీయత ఇంతమాత్రమే అనవచ్చు.
ప్లూటార్క్ ననుసరించి అంటోనీ వయస్సు ఏబదిమూడు సంవత్సరాలు. కథారంభం నాటికి అతనికి నలుబది ఆరు సంవత్సరాలు ఉండి ఉండవచ్చు. ఈ నాటక రచనాకాలానికి షేక్స్ పియర్ వయస్సు దరిదాపుగా అంతే ఉంది. అతడు యుద్ధరంగాలలో, ఇతడు సాహిత్యరంగాలల్లో సమానంగానే విజయాలు చేకొన్నారు. భవిష్యత్తును గురించి ఇరువురి దృష్టీ ఒకవిధంగా నడవటానికి అవకాశంముంది. అయినా షేక్స్ పియర్ తనయవ్వన కాల ప్రణయాన్ని స్మృతికి తెచ్చుకొని, నవ్యత నాపాదించి, దాన్ని కొంతగా 'ఆంటోనీ - క్లియోపాత్రా' రచనమూలంగా ప్రదర్శించి ఉండవచ్చు.
భుజబుద్ధి సంపన్నత చేత శత్రుసంహారం చేసి రోమక మహాపురుషుల్లో ఒకడని విఖ్యాతిగన్న మార్క్ ఆంటోనీ మహాశయుణ్ణి, ఈజిప్టు రాజ్ఞి క్లియోపాత్రా తన అపురూప సౌందర్యంతో ఆకర్షించి, విలాసప్రియత్వాన్ని నేర్పి, అలెగ్జాండ్రియాలో ఒక కామారాధకుణ్ణి చేసి కట్టిపడేస్తుంది. తన సర్వస్వం ఆ ఈజిప్టు సామ్రాజ్ఞియే అయినా, అతని కప్పుడప్పుడూ సహజ దేశాభిమానంవల్ల రోమకభావాలు కలిగి, కలతపెడుతూ
148
వావిలాల సోమయాజులు సాహిత్యం-3