Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనవసరమని అనలేము. ఆంటోనీకి శకునజ్ఞుడు చేసిన హెచ్చరికలను, సిడ్నస్ నదిమీద నిల్చి ఆంటోనీని సమ్మోహితుని చేసిన క్లియోపాత్రా వర్ణనను నడిపే సందర్భంలో, షేక్స్ పియర్ మూలాన్ని కొంత మార్చాడు. పూర్వం ఆంటోనీలో కన్పట్టిన శౌర్యసాహసాదులను గురించి ఆక్టేవియా చేసిన ప్రసంగం ప్లూటార్క్ రచనలో ఎంతో ఘనంగా కనిపిస్తుంటే షేక్స్ పియర్ దానిని తరువాతి కాలంలో అంటోనీ అనుభవించిన దుఃస్థితికి అనుగుణంగా మార్చి చిత్రించాడు. ఆంటోనీ పాంపేను కలుసుకొన్న తరువాత శకునజ్ఞుడు అతన్ని హెచ్చరించినట్లు మూలంలో ఉంటే, నాటకకర్త ముందే అతడు హెచ్చరించినట్లు మార్పుచేశాడు. ఈ మార్పువల్ల ఆంటోనీ తొందరపాటును సూచించటమే షేక్స్ పియర్ సాధించిన ప్రయోజనం.

షేక్స్ పియర్ ఈజిప్టుకు సంబంధించిన వర్ణనలన్నింటినీ హాలండ్ అనువదించిన ప్లినీచరిత్రకారుని రచనలవల్ల గ్రహించాడు. పాంపేకు సంబంధించిన విశేషాలెన్నో షేక్స్ పియర్ కు ఏప్పియన్ రచనలవల్ల లభించాయి. ఫుల్వియా మరణం, పాంపే దండయాత్ర అన్న రెండంశాలూ ఫుల్వియా, లూషియస్ ల విప్లవ యుద్ధవార్తతోనూ, పార్థియన్లు దండెత్తి రావటంతోనూ కలిసి తెలియటమనే అంశం, ఫ్లూటార్క్ రచనకు భిన్నం. ఆంటోనీ ద్వితీయవివాహం, ఆక్టేవియస్ తొ సంపూర్ణంగా శత్రుత్వం ఏర్పడే మధ్యకాలంలో ఆంటోనీ చేసిన ఇటలీ ప్రయాణాన్ని పరిత్యజించటం, సోదరుడికీ, భర్తకు సామరస్యాన్ని కుదర్చటానికి ఆక్టేవియా చేసిన రెండు యత్నాలను ఒకే యత్నంగా నిరూపించటం, ఫ్లూటార్క్ రచనకు భిన్నాలు. ఇటువంటి స్వల్పమైన మార్పులు కొన్ని గోచరించినా, షేక్స్ పియర్ ప్లూటార్లో కన్పట్టే ప్రధానాంశాలను మార్చలేదు. కథను రూపకోచితంగా చేసేటందుకు తదనుగుణాలైన కొలదిమార్పులను మాత్రమే చేశాడు. ఇట్టి మార్పులతో ఒక అస్థిపంజరాన్ని నిర్మించుకొని తన శిల్పకళానైపుణ్యాన్ని ప్రదర్శించి, షేక్స్ పియర్ ఆంటోనీ - క్లియోపాత్రాను ఒక జీవమయచిత్రంగా శిల్పించి, రసికలోకానికి కాన్క పెట్టాడు.

పాత్రోన్మీలన - మూలాతిక్రమణలు

ఆంటోనీని పరిపూర్ణయోధుడుగా చిత్రించదలచిన షేక్స్ పియర్ పార్థియనుల చేతుల్లో అతడు పొందిన ఓటమిమాట ఎత్తుకోకుండా వదలివేశాడు. ప్లూటార్క్ చిత్రించిన ఆంటోనీ క్రీడాలోలుడు, విలాసి. ఆంటోనీలో గోచరించే సాహసౌదార్యాదిసద్గుణాలు ఫ్లూటార్క్ రచనలోనూ లేకపోలేదు. కాని అందులో దోషపుంజాలమధ్య మరుగుపడి ఉన్న ఆ గుణాలకు షేక్స్ పియర్ ప్రాధాన్యమిచ్చి చిత్రించాడు. సర్వనాశనం చేసిన


ఆంటోని - క్లియోపాత్రా

145