Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తరువాత ఆంటోనీ క్రీ.పూ. 40 వసంతంలో క్లియోపాత్రా బాహుబంధాలలో నుంచీ ఎలాగో బయటపడి, అలెగ్జాండ్రియానుంచి ఆసియాకు, అక్కడినుంచి గ్రీసుకు పయనమైనాడు. అక్కడ ఆక్టేవియస్ పెరూసియాను జయించిన వార్తను తన భార్య ఫుల్వియావల్ల విని, అతడు ఇటలీకి వెళ్లుతుండగా త్రోవలో యుద్ధమంతటికీ మూలకారణం తన భార్య పుల్వియాయే అనీ, ఆమె తన్ను ఈజిప్టునుంచి రప్పించటానికి ఇంత చేస్తున్నదనీ తెలుసుకొన్నాడు. ఆంటోనీ - 'అదృష్టంవల్ల' క్రీ.పూ. 40లోనే అతని భార్య ఫుల్వియా మరణించింది. ఆ సంవత్సరమే ఆంటోనీ - ఆక్టేవియన్ల మధ్య బ్రుండూషియం సంధి జరుగుతుంది. రోమక సామ్రాజ్యాన్ని ఇరువురూ తిరిగి పంచుకొంటారు. ప్రాచ్యరాజ్యం ఆంటోనికి వచ్చింది. పార్థియన్ల దగ్గరినుంచీ అతడు ఆసియా మైనరును జయించవలసి ఉంది. పశ్చిమరాజ్యానికి అధినేత అయిన ఆక్టేవియస్ మీద సెక్స్టస్ పాంపేను రూపమాపవలసిన భారం పడ్డది. ఆక్టేవియస్ చెల్లెలైన ఆక్టేవియాతో ఆంటోనీకి వివాహం జరగటంవల్ల, ఆక్టేవియస్ - ఆంటోనీల మధ్య చక్కనిబాంధవ్యం కూడా ఏర్పడ్డది. క్రీ.పూ. 39లో ఆంటోనీ మైసినందగ్గిర పాంపేతో సంధి చేసుకొని, కొన్ని షరతులమీద సిసిలీ, సార్టీనియాలను అతనికి ఇచ్చి వేశాడు, తరిగానివేళ పార్థియన్ల మీద దండయాత్రను తలపెట్టి విఫలుడైనాడు. ఈ అపజయవార్తలు రోముకు చేరుకున్నాయి. రోమన్ ప్రజల్లో ఒక అలజడి బయలుదేరింది. క్లియోపాత్రాతో అతడు గడుపుతున్న కామైక జీవితం, అతని విలాసోన్మత్తత, భోగలాలసత రోములో పొక్కిపోయాయి. అంతటితో ఆంటోనీ రోములోని ఎందరో ఆప్తమిత్రులను పోగొట్టుకొన్నాడు. క్రీ.పూ. 32లో అంటోనీ - ఆక్టేవియాల వివాహం విచ్ఛిన్నమైంది. క్లియోపాత్రామీద ఆక్టేవియస్ యుద్ధాన్ని ప్రకటించాడు. రోమన్ మతానికీ, కుటుంబవ్యవస్థకూ ఆమెవల్ల అనంతనష్టం కలుగుతున్నదన్న ఉద్దేశంతోనూ, ఆతురతతోనూ రోమన్ ప్రజానీకం ఆక్టేవియస్ పక్షం వహించి, అండగా నిలిచారు. ఆంటోనీ - ఆక్టేవియస్ ఇరువురికీ క్రీ.పూ. 31 సెప్టెంబరు మాసంలో ఆస్ట్రియంవద్ద ఘోరయుద్ధం జరిగింది. ఆక్టేవియన్కు విజయం చేకూరింది. అపజయంవల్ల అలెగ్జాండ్రియాకు పారిపోయిన తరువాతకూడా ఆంటోనీ క్లియోపాత్రా వారి కామోన్మత్తవిలాసకేళీలోలతను కొనసాగిస్తూ వచ్చారు. విజయోత్సాహ దోహదంతో ఆక్టేవియస్ మరుసటి సంవత్సరం ఈజిప్టు మీదకే దండెత్తి అలెగ్జాండ్రియాను ముట్టడించడంతో, ఎదుర్కొని పరాజితుడైన ఆంటోనీ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆత్మప్రాణహననంలో క్లియోపాత్రా 'పతియైన అతణ్ణి అనుసరించింది. వివాహం


140

వావిలాల సోమయాజులు సాహిత్యం-3