డార్డినస్ : ఆయన్ను చంపమంటున్నాడు క్లిటస్! ఆత్మభావచయంలో ఆయన ఎలా మగ్నుడైపోయినాడో చూడు.
క్లిటస్ : ఈ బ్రూటస్ హృదయపాత్ర దుఃఖంతో నిండి పొర్లిపోతున్నది. ఆ కన్నీటిని గమనించు.
బ్రూటస్ : ఇలారా, వొలుమ్నియస్! నేను చెప్పింది విను.
వొలుమ్నియస్ : ఏమంటున్నారు ప్రభూ?
బ్రూటస్ : సీజర్ భూతరూపం నాకు రెండుమార్లు దర్శనమిచ్చింది. ఒకమారు సార్డిస్ లో, మరోమారు రాత్రి ఫిలిప్పీ యుద్ధభూమిలో. నా అంత్యం దగ్గరకు వచ్చింది నాకు తెలుసు. వొలుమ్నియస్ : లేదు ప్రభూ! అలా అనకండి.
బ్రూటస్ : లేదు. నాకు నిశ్చయంగా తెలుసు. వ్యవహారాలెలా నడుస్తున్నవో నీకు తెలుసు. శత్రువులు మనలను గర్తందాకా తరుముకోవచ్చారు. వారు వచ్చి అందులోకి నెట్టేదాకా తారట్లాడటం కంటే ఈ ప్రపాతం నుంచి దుమకటం మనకు క్షేమం.
వొలుమ్నియస్! నీవూ, నేనూ బాల్యమిత్రులం కలిసి బడికివెళ్ళాం. ఆ అపూర్వమైత్రికి సాక్షిగా నీవు నా కత్తిని పట్టుకో. నేను దానిమీదికి పరుగెత్తి ప్రాణాలు కోల్పోతాను.
వొలుమ్నియస్ : ఇది మిత్రుడికి ఆదేశింపదగ్గ ఉద్యోగం కాదు ప్రభూ!
(ఇంకా యుద్ధకోలాహలం వినిపిస్తుంటుంది.)
క్లిటస్ : ఇక్కడ తారాడి ప్రయోజనం లేదు. ప్రభూ! పరుగెత్తిపొండి, పరుగెత్తిపొండి.
బ్రూటస్ : మీకు ఇదే నా వీడ్కోలు. నీకు క్లిటస్! నీకు వొలుమ్నియస్! స్ట్రాటో! ఇంతవరకూ నీవు నిద్రలో మునిగున్నావు. నీకూ నా వీడ్కోలు. జీవితంలో ఒకటే నాకు పరమానందం. నా తుదిదాకా నా మిత్రులందరూ నాయెడ సత్యసంధులై వర్తించారు. ప్రయోజనరహితమైన విజయం వల్ల ఆక్టేవియస్, ఆంటోనీ పొందేదానికంటే అపజయం వల్లనే నేను అధికంగా సాధింపగలిగాను. ఇక మీకు, మీ అందరికీ వీడ్కోలు. బ్రూటస్ జీవితచరిత్ర ఇంతటితో అంతమొందినట్లే. రాత్రి నా కనురెప్పలమీద కూర్చున్నది. అంతరాత్మ విశ్రాంతి కోసం ఆతురత వహిస్తున్నది. ఇంత కాలం నా శరీరం శ్రమించింది ఈ పుణ్య సమయం కోసమే.
124
వావిలాల సోమయాజులు సాహిత్యం-3