మెసెల్లా : ఇది ఆయన కాదేమో!
టిటినియస్ : పొరబడకు మెసెల్లా! ఇది ఆయనే. ఇక కాషియస్ మనకు లేడు.
ఓ అస్తమించే సూర్యుడా! ఈ రాత్రి అరుణకాంతులతో ఎలా నీవు అస్తమిస్తున్నావో, అలాగే తన అరుణారుణరక్త కాంతులతో కాషియస్ ఈ నాడు అస్తమించాడు. రోమక భానుడు " అస్తమించాడు.
మనరోజు గడిచింది. మేఘాలు, పొగమంచు, ఆపదలు ఆవరించాయి. మన పని పూర్తయింది. నే వెళ్ళిన పని విషయంలో ఉన్న అనుమానం ఇంత పని చేసింది.
మెసెల్లా : విజయం చేకూరదన్న అనుమానమే ఈ పని చేసింది. ఓ చింతాదేవిదుహితా! నీచదోషమా!! అసత్య దృశ్యాలను అమాయకుల ఎదట ఎందుకు ప్రదర్శిస్తావు? ఓ దోషమా! నీవు చింతామూర్తి హృదయాన జన్మిస్తావు. నీ జన్మవల్ల అందుకు కారణభూతురాలైన నీ మాతృమూర్తి చింతాదేవి నశిస్తుంది.
టిటినియస్ : పిండారస్! ఎక్కడున్నావు?
మెసెల్లా : టిటినియస్! వీడెక్కడున్నాడో వెతుకు. నేనీవార్తను బ్రూటస్ చెవి కెక్కించి వస్తాను. ఎక్కించటం కాకేమిటి? దూసుకోపోయే కత్తికంటే, విషపుటికంటే ఈ దృశ్యానికి సంబంధించినవార్త ఆయన కెంతో దారుణంగా ఉంటుంది.
టిటినియస్ : మెసెల్లా! నేను పిండారస్ ను వెతుకుతాను. నీవు వెళ్ళు.
(మెసెల్లా నిష్క్రమిస్తాడు)
వీరుడా! కాషియన్, మీరు నన్నెందుకు పంపించారు? నేను నా మిత్రులను కలుసుకోలేకపోయినానా? వారు ఈ విజయపుష్పమాలను నాకిచ్చి నీ ఫాలదేశాన్ని అలంకరించమన్నారే! వారి ఆనందకోలాహలాన్ని వినలేదా? అయ్యో! మీరు సమస్తాన్నీ అపార్థం చేసుకొన్నారు. ఇదుగో చూడండి. ఈ పుష్పమాలతో మీ ఫాలాన్ని అలంకరించుకోండి. ఇది మీ కివ్వమని మీ బ్రూటస్ నన్ను ఆజ్ఞాపించాడు. నేను ఆయన ఆజ్ఞను పాలిస్తున్నాను. బ్రూటస్! మహాశయా! రండి! వేగంగా రండి!! చూడండి. నేను కేయస్ కాషియస్ ను ఎలా గౌరవిస్తున్నానో చూడండి. ఇది రోము పౌరులు ఆచారం. ఓ దేవతలారా! మీ అనుజ్ఞ నివ్వండి. రా, కాషియస్ మహాశయుని కరవాలమా! రా. టిటినియస్ హృదయాన్ని పరిశీలించు.
(ఆత్మహత్య చేసుకుంటాడు)
120
వావిలాల సోమయాజులు సాహిత్యం-3