Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రూటస్  : వారు నిలువబడ్డారు మనతో సంప్రదించదలచినట్లున్నారు.

కాషియస్  : టిటినియస్! ఆగిపో. ముందుకు వెళ్ళి మనం వారితో మాట్లాడాలి.

ఆక్టేవియస్  : మనం యుద్ధచిహ్నాన్ని వారికి అందిద్దామా?

ఆంటోనీ  : లేదు. సీజర్, వారి ఎత్తేమో చూచి సమాధానం చెబుదాం. ముందుకు పోదాం. బ్రూటస్, కాషియస్ సేనాపతులు మనతో మాట్లాడదలచి నట్లున్నారు.

ఆక్టేవియస్  : సంజ్ఞ చేసేటంతవరకూ కదలవద్దు.

బ్రూటస్  : దేశీయులారా! పోటీలకు ముందు మాటలా?

ఆక్టేవియస్  : మాటలంటే మాకు మీ కంటే ఇష్టమని కాదు.

బ్రూటస్  : మంచి మాటలు పోటులకంటే మంచివి.

ఆంటోనీ  : చెడ్డపోటులు పొడిచేటప్పుడు బ్రూటస్, నీవు మంచిమాటలే చెపుతావు. 'చిరంజీవ! జై సీజర్!' అన్న నినాదాలు చేస్తూనే సీజర్ ను పొడిచిన పోటు ఇందుకు సాక్ష్యం.

కాషియస్  : ఆంటోనీ! నీ పోటులు ఏ వంకకు పడతాయో ఇంకా తెలియదు. కానీ నీ మాటలు హైబ్లా" తేనెటీగలు దాచుకున్న తేనెనంతటినీ కాజేసి, వాటికి లేకుండా చేసినట్లు కన్పిస్తున్నవి.

ఆంటోనీ  : తేనె లేకుండా చేయటమే కాదు కుట్టటం కూడా లేకుండా చేసినట్లున్నవి నీవి.

బ్రూటస్  : అవును. వాటి ఝంకారాన్ని నీవు పుచ్చుకొన్నావు గనక నీవి రొదకూడా కాజేసినట్లున్నవి. కానీ కుట్టబొయ్యేముందు తెలివితేటలతో ప్రవర్తించు.

ఆంటోనీ  : ద్రోహులారా! నన్ను భయపెడుతున్నారా? మీ చురికలు ఒకదానితో ఒకటి సీజర్ శరీరంలో రాచుకొంటున్నప్పుడే మీరు అలా ప్రవర్తించ లేదు. అందుకు ప్రతిగా మీరు కాస్కా పిచ్చిగజ్జికుక్కలా సీజర్ మెడమీద దొంగపోటు వేసినప్పుడు స్తోత్రపాఠకుల్లాగా, మబ్బుల్లా పళ్ళికిలించి, కుక్కల్లా కాళ్ళమీద పడ్డారు.

కాషియస్  : బ్రూటస్, ఇందుకు నిన్ను నీవే అభినందించుకోవాలి. కాషియస్ మాట చలామణి ఔతుంటే ఈ నాలుక ఈ నాడిలా కారులు ప్రేలగలిగేదా?


114

వావిలాల సోమయాజులు సాహిత్యం-3