బ్రూటస్ : లూసిల్లియస్! టిటినియస్!! ఈ రాత్రి తమ సైన్యాలను నిలపటానికి డెరిజాలను వేయించవలసిందని సేనానాయకులను ఆజ్ఞాపించండి.
కాషియస్ : మీరు మీ సెల్లాను వెంటబెట్టుకొని తత్ క్షణమే మా దగ్గరకు రండి.
(లుసిల్లియస్, టిటినియస్ నిష్క్రమిస్తారు)
బ్రూటస్ : లూషియస్! ఒక చషకంనిండా ద్రాక్షాసవాన్ని తీసుకో రా.
కాషియస్ : మీకు ఇంత కోపం వస్తుందని నేను ఎన్నడూ భావించలేదు.
బ్రూటస్ : కాషియస్! అనేకబాధలవల్ల నేను మాములుగా లేను.
కాషియస్ : ఏవో తాత్కాలికాలైన బాధలకు నీవు లొంగిపోతే తత్త్వజిజ్ఞాసవల్ల మీరు పొందిన ప్రయోజనమేముంది?
బ్రూటస్ : కాషియస్! ప్రస్తుతం బ్రూటస్ కంటే అధికదుఃఖాన్ని ఎవరూ భరించటం లేదు. పోర్షియా మరణించింది
కాషియస్ : ఏమిటి! పోర్షియా మరణించిందా?
బ్రూటస్ : అవును. ఆమె మరణించింది.
కాషియస్ : ఇందాక మీకు అంతటి కోపాన్ని తెప్పించినప్పుడు నన్ను చంపలేదేమా అని నాకిప్పుడు ఆశ్చర్యం వేస్తున్నది. మీ చేతిలో చావును ఎంతగా తప్పించుకొన్నాను. అబ్బా! ఎంత భరించరాని బాధ! ఇది నా హృదయాన్ని గాయపరుస్తున్నది. జబ్బేమిటి?
బ్రూటస్ : నా వియోగాన్ని సహించలేకపోవటం. ఆమె మరణవార్తతోబాటు, యువకుడైన ఆక్టేవియస్, మార్క్ ఆంటోనీతో చేరి, నాకు వ్యతిరేకంగా బలవత్తరుడైనాడన్న వార్త కూడా వచ్చింది. ఆమె ఉన్మత్తురాలైందట. సేవకులు లేనప్పుడు నిప్పు మ్రింగిందట!
కాషియస్ : అందువల్ల మరణించిందా?
బ్రూటస్ : అవును.
కాషియస్ : అమరులారా! దేవతలారా!!
లూషియస్ ద్రాక్షాసవంతో బాటు కొన్ని లేఖాపత్రాలను కూడా తీసుకొని ప్రవేశిస్తాడు.
106
వావిలాల సోమయాజులు సాహిత్యం-3