బ్రూటస్ : నీ దోషాలంటే నాకిష్టం లేదు.
కాషియస్ : మిత్రుని కంటికి ఆ దోషాలు కనిపించనే కనుపించవు.
బ్రూటస్ : అవి ఒలింపస్ పర్వతాలవలె దొడ్డవై కనిపిస్తున్నా, స్తుతి పాఠకుడు గమనించడమే కాని, వాటిని సత్యసంధుడైన ఉత్తమమిత్రుడు గుర్తించకుండా ఉండలేడు.
కాషియస్ : ఆంటోనీ, రా! యువకుడా, ఆక్టేవియస్ రా! ప్రపంచమంటే కాషియస్ విసిగిపోయాడు. రండి, మీ ప్రతీకారాన్ని తీర్చుకోండి. తాను హృదయ పూర్వకంగా ప్రేమించిన వ్యక్తి, అతడి బావ, అతణ్ణి అసహ్యించుకుంటున్నాడు. అతడి సోదరుడు. అతణ్ణి సేవకుణ్ణి తిట్టినట్లు తిడుతున్నాడు. అతడు నా ముఖాన దులపటానికి నా దోషాల నన్నింటినీ గమనించాడు. గ్రంథస్థం చేశాడు. చదివి కంఠస్థం చేశాడు.
అబ్బా! నేను నా కన్నుల్లోనుంచి జీవనజ్యోతిని తొలగించుకోగలను. ఇదే నా వక్షఃస్థలం. ఇందులో ప్లూటస్ గని40 కంటే, కనకం కంటే, ప్రియమైన నా హృదయముంది. ఇదిగో నా ఛురిక! బ్రూటస్ మహాశయా! మీరు రోము పౌరులే అయితే అందుకోండి. దాన్ని అందుకోండి. ధనాన్ని నిరాకరించిన నేను మీకు హృదయాన్నిస్తున్నాను. పొడవండి. మీరు పూర్వం సీజర్ నెలా పొడిచారో అలాగే పొడవండి. నాకు తెలుసు - అతణ్ణి అత్యధికంగా అసహ్యించు కుంటున్నప్పుడే, మీరు కాషియస్ ను ఎన్నడూ ప్రేమించనంతటి అధికంగా ప్రేమించారు.
బ్రూటస్ : నీ ఛురికను ఒరలో నిల్పు. నీవు కోపగించదలచినపుడు కోపగించు. అది స్వేచ్ఛగా వ్యవహరించ దలచుకొన్నప్పుడు వ్యవహరించనీ. నీవు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించు. నీవు చేసిన అప్రతిష్టాకరమైన ఏ కృత్యాన్నైనా నేనొక తాత్కాలిక చేష్టగా భావిస్తాను. కాషియస్, నీవు గొట్టెవంటి సౌమ్యునితో జోడుకోడె వైనావు. అతడి కోపం క్షణకాలం. అది చెకుముకి రాయి నిప్పు రవ్వలు ధరించినంత కాలం మాత్రమే ఉంటుంది. చాలా గట్టిగా కొట్టినప్పుడు ఒక రవ్వను పొందుతుంది. వెంటనే చల్లారిపోతుంది.
కాషియస్ : కాషియస్ తన దుఃఖంతో, కోపంతో మీకు విలాసాన్నీ, హాస్యాన్నీ కల్పించటానికి జీవించి ఉన్నాడన్న మాట!
బ్రూటస్ : ఆ మాట అన్నప్పుడు నా మానసికస్థితి ఏమీ బాగాలేదు.
కాషియస్ : ఇంతవరకైనా ఒప్పుకుంటున్నారు. ఏదీ మీ హస్తాన్ని ఇలా అందించండి.
104
వావిలాల సోమయాజులు సాహిత్యం-3