Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాకు తెలియటం వల్ల అతణ్ణి వదలిపెట్టవలసిందని ఎన్నోమార్లు మిమ్మల్ని లేఖల మూలంగా ప్రార్థించాను.

బ్రూటస్  : ఈ విషయంలో లేఖలు వ్రాసి నీకు నీవే ద్రోహం చేసుకున్నావు.

కాషియస్  : ప్రతి స్వల్ప విషయాన్నీ ఇలా దోషంగా నిరూపించటానికి ఇది తగ్గ సమయం కాదు.

బ్రూటస్  : ఈ లంచగొండితనం అనే దోషం నీలో కూడా ఉందని నేను విస్పష్టంగా చెప్పక తప్పదు. బంగారానికి ఆశ పడి నీవు మంచి ఉద్యోగాల నన్నిటినీ అయోగ్యులైన వారికి అమ్మావు.

కాషియస్  : ఏమిటీ? నాలో లంచగొండితనముందా? ఈ మాట్లాడేది బ్రూటస్ అని తెలుసుకుంటే మీరు ఇలా పలికేవారు కారు.

బ్రూటస్  : కాషియస్ పేరు లంచగొండితనంతో సంబంధం పెట్టుకొని, దానికి గౌరవాన్ని ఆపాదిస్తున్నది. అందువల్ల శిక్షాకాంక్ష సిగ్గుతో తలవంచుకోవలసి వచ్చింది.

కాషియస్  : ఏమిటి? శిక్షించటాన్ని గురించి ఆలోచిస్తున్నారా?

బ్రూటస్  : ఔను. మార్చి నెల జ్ఞప్తికి తెచ్చుకో. మార్చి పదిహేనును జ్ఞప్తికి తెచ్చుకో. ఘనుడైన జూలియస్ ఆ నాడు న్యాయం కోసమేగదా తన రక్తాన్ని స్రవింపజేసుకొన్నది! న్యాయం కోసం కాక క్రౌర్యంతో అతణ్ణి పొడిచిన ద్రోహి ఆ నాడు ఒక్కడైనా ఉన్నాడా? ప్రపంచంలోకెల్లా ప్రథమ గణ్యుడైన ఆ వ్యక్తిని హతమార్చింది బందిపోటు దొంగలకు సాయపడటం కోసమేనా? మన అనంత గౌరవాన్ని పణం పెట్టి, మన హస్తాలను లంచగొండితనంతో మలినం చేసుకోవటానికేనా? ఆ పని చేసింది ఇందుకే ఐతే నేను అట్టి ఒక రోము పౌరునిమీద పడటం కంటే శ్వానాన్నై జన్మించి చంద్రుణ్ణి38 చూచి మొరుగుతూ ఉండేవాణ్ణి.

కాషియస్  : బ్రూటస్, నన్ను ఒత్తిడి చెయ్యవద్దు ఇది నేను సహించను. ఎలా నేను వ్యవహరించాలో ఆదేశిస్తూ నీవు నేనెవర్నో మరిచిపోతున్నావు. నేను బహుకాలానుభవం ఉన్న సైనికుణ్ణి. ఏర్పాట్లు చేయటంలో నీకంటే సమర్థుణ్ణి.

బ్రూటస్  : కాషియస్, ఇక చాలు. అంతటితో ఆపు. ఈ విషయంలో నీవు సమర్థుడివి కావు.


జూలియస్ సీజర్

101