కన్నమ : నేను సైన్యాలను ఆపలేకుండా ఉన్నాను తండ్రీ! (తెరలో కలకలం) ఓ యోధులారా! కొంచెం శాంతించండి.
బ్రహ్మన్న : (పానీయ పాత్ర లోపలికి తీక్షణంగా చూస్తూ ఉన్న కొమ్మరాజుతో) ఏమిటి బావా, తీక్షణంగా పరిశీలిస్తున్నారు?
కొమ్మరాజు : (చూపిస్తూ) ఈ ఈగను చూడండి మహామంత్రి!
బ్రహ్మన్న : (వంగి చూస్తున్నట్లు మెడ సారించి) ఇప్పపువ్వు సారాయిలో పడ్డ ఇది భయంకర రణరంగంలో పడిపోయిన బ్రహ్మన్న మాదిరిగానే తప్పించుకోటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నది. రణభట్టు రాయబారమైనా విఫలం కాకుండా ఉంటే ఎంత బాగుండేది.
సేవకుడు : (ప్రవేశించి) ప్రభూ! రాయబారిట.
బ్రహ్మన్న : (ఆశ్చర్యంతో ముఖం పైకెత్తి) ప్రవేశపెట్టు.
(సేవకుడు నిష్క్రమిస్తాడు)
(కొమ్మన్నతో) ఈ రాయబారి ఎక్కడినుంచి?
కొమ్మరాజు : నాగమ్మ మతి ఏమైనా తిరిగి ఉంటుందా?
కన్నమ : ఇంకా మీకెక్కడి వెర్రి. దిక్కులు తారుమారైనా ఆ మనిషి గుండె తిరగటం కల్ల. త్వరగా అనుజ్ఞ ఇవ్వక ఇంకా ఎందుకీ ఆలస్యం?
(ఒక సైనికుడు త్రోవ చూపిస్తుంటే కోటకేత రాజు ప్రవేశిస్తాడు)
బ్రహ్మన్న : ఎవరూ? ధరణికోట యువరాజు! కోటకేతూ!! రా! నాయనా, (కూర్చోమని హస్తసంజ్ఞ) భీమరాజుల వారికి కుశలమా?
కేతరాజు : (ఆసనమలంకరిస్తూ) అమరేశ్వర స్వామి కృప వల్ల, రణగండ్ల యుద్ధంలో మీరు చూపించిన అవక్ర పరాక్రమాన్ని నాకు కథలుగా వినిపించి ఎప్పుడూ మీ ప్రశంస చేస్తుంటారు బాబూ!
బ్రహ్మన్న : వారికి నానతులని చెప్పునాయనా! గడిచి బ్రతికితే వచ్చే కార్తిక పౌర్ణమికి అమరేశ్వర దర్శనం, భీమరాజులవారికి ప్రీతిపూర్వక నమస్కారం.
నాయకురాలు
75