Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగమ్మ : ప్రభూ! ఇది ఒక ఎత్తు. మళ్ళీ ఒక తడవ బెదిరిస్తే మహా రాజేమన్నా లొంగుతాడేమోనని, మాటలతో మసిపూసి మారేడు కాయ చేయదల్చుకున్నాడు బ్రహ్మన్న.

నలగామ : భట్టూ! మీ రాజు యుద్ధానికి సిద్ధపడ్డాడా?

రణభట్టు : సిద్ధపడటమేమిటి కారెంపూడి కదనరంగం. సైన్యాలు బారులు తీర్చినవి. నాగులేరు దాహంతో రక్తం తాగటానికి నాలుక జాపు తున్నది. మీకిష్టమైతే మేము అందీయటమే ఆలస్యం.

నరసింహ : మహామంత్రిణీ! కదనరంగం కారెంపూడిట,

నాగమ్మ : మనకు కారెంపూడి అయినా ఒకటే, కైలాసమైనా ఒకటే. వచ్చే శివరాత్రి నాటికి కదనరంగానికి చేరుకుంటామని వార్త పంపండి.

నలగామ : మహామంత్రిణీ! శుభదినం.


ఎంతేనిన్ శుభమైనదా దినము భూతేశుండు స్వాంతంబునన్
పంతంబూని సమస్త లోకముల దీవ్యచ్ఛక్తి పోకార్చున
త్యంతంబున్, నటియించు తాండవము నుద్యద్దివ్య దర్పోద్ధతిన్
సంతోషంబుగ, నెంతయున్ శుభదినం బానాడు, పోరాడగన్


భూతేశుడు ప్రళయకాల నృత్యం ప్రారంభించే దినం. భట్టూ! వెళ్ళి చెప్పు, బ్రహ్మన్నను సిద్ధపడమను.

నరసింహ : భట్టూ! ప్రాణాలు దక్కవను. మా బల్లెపు పోట్లు భరించలేరని చెప్పు. నరసింగరాజు సర్వసేనాధిపతియని చెప్పు. ఈ సమస్తాన్ని నడిపించేది నేనని చెప్పు.

నాగమ్మ : నాగమ్మ ఒక సేనని నడిపిస్తుందని చెప్పు.

రణభట్టు : నాగమ్మ నడిపించినా, నరసింహుడు నడిపించినా నా తండ్రి బ్రహ్మన్న భయపడడు. ప్రళయ కాల రుద్రుడు మీ వైపు రణరంగంలో త్రినయనం తెరిచినా బ్రహ్మన్న తండ్రి భయపడడు. బ్రహ్మన్న భటుడు ఒక్కడైనా ఉలకడు. మరుమాట పలుకడు. శత్రురక్తంతో అలరాజుకు తర్పణం విడిస్తే కాని శాంతి వహించడు. ఆచార రక్షణం అనే పేరుతో జరిగే దురాచారాలను అంతమొందిస్తే కాని నిద్రపోడు. ఆహవరంగంలో అపజయమన్నది ఎరుగడు ఆ బ్రహ్మన్న. మీ పాపకృత్యాలకు ప్రతిఫలం మరుసటి జన్మల్లో కూడా అనుభవిస్తారు.

(నిష్క్రమణ)


68

వావిలాల సోమయాజులు సాహిత్యం-2