Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అమాత్యవర్యా! రాజవైద్యుని ప్రభువు వారి శరీరస్థితిని గూర్చి ప్రజలకు నివేదింపమని ఆజ్ఞాపింపకోరుతున్నాను.

అమాత్యుడు : భృత్యశ్రేష్ఠా! రాజభిషగ్వరుని రావింప యోగ్యుడగు రక్షకభటుని కాహళ పూరింప నాజ్ఞాపింపుమని రాజు అంగరక్షకులని మహారాజ్ఞి అనుశాసించుచున్నదని నివేదించిరమ్ము -

బుధాదేవి : రాజవైద్యులు మీ కుడిప్రక్కనే ఉన్నారు గదా అమాత్యవర్యా!

అమాత్యుడు : అయిన మన అనుస్యూతములైన సంప్రదాయ మర్యాద లనుల్లంఘనీయములు గదా దేవీ!

బుధాదేవి : ఇట్టి విషమ పరిస్థితులలో, ఇంకా సంప్రదాయాలూ, మర్యాదలను పాటింపనవ సరం లేదని నేను ప్రకటిస్తున్నాను.

అమాత్యుడు : అయిన నిక సంప్రదాయానుసారం నియోజితులైన రక్షకభటులు -

బుధాదేవి : ఎక్కడివారక్కడనే ఉండాలి. ఇది ప్రత్యేకంగా నేను ఏర్పరచి నడిపించ పూనుకొనే కార్యాలోచన వర్గము - దీనికి మీ పాలక వర్గంతోనూ మీ అమాత్యాది భృత్య వర్గంతోనూ ఏ విధమైన సంబంధము లేదు. మీ సంప్రదాయాలూ, ఆచార వ్యవహారాలతో నాకు కొంత పరిచయం కలిగిందని మీరు ఇప్పటికే గ్రహించారను కుంటాను.

అమాత్యుడు : అయిన మీ పాలకవర్గము వారి సంపూర్ణామోదమును బొందకయే మహారాజ్ఞి జనసామాన్యముతో ప్రత్యేక కార్యాలోచనావర్గము నేర్పరచరాదని నేను సవినయంగా మనవి చేయుచున్నవాడను.

బుధాదేవి : అమాత్యవర్యా! మీరంతగా పట్టుపట్టినప్పుడు నేనీ జనసామాన్యంలో కొందరికి రాజ్యమిచ్చి ప్రభువులను చేసిన తరువాతనే, ప్రస్తుత స్థితిని గూర్చి నాకు సదుపదేశాలివ్వగల కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పరచుకుంటాను

అమాత్యుడు : ఇట్టి విషమ పరిస్థితుల యందా జనసామాన్యమునందున్న వారిలో కొందరికి ప్రభువర్గముగా రాజ్యాధిపత్యమిచ్చి గౌరవస్థానముల నభివృద్ధి నొందింపదగదు. అది దేశమునకును, మన సామ్రాజ్యమునకు మహారాజాధి రాజశ్రీ చండస్కంధ చక్రవర్తికిని ప్రమాదమని మీ భృత్యుడు సవినయముగా బుద్ధిబలము నుపయోగించి, ఆలోచించి విన్నవించుకొనుచుంటిని.


482

వావిలాల సోమయాజులు సాహిత్యం-2