Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


పగయడ గించుటెంతయు శుభంబని యాపితి నింతదాకమి
మ్మగణిత యుద్ధవీరుల, మహాద్భుత విక్రమ శౌర్యుసారులన్
పగతురు చీరికిన్ గొనరు, భ్రాంతి వహించిరి, పాపబుద్ధులై
తగవు తలంప కీగతి నధర్మము చేసిరి - సంధి యొప్పునే


బ్రహ్మన్న : (ఏదో ఆలోచన చేసి కాదన్నట్లు తల త్రిప్పుతూ) బ్రహ్మన్న హృదయ కుహరంలో చిర నిద్రపోతూ ఉన్న శార్దూలాన్ని మేల్కొల్పి కాటు చవి చూడదలచుకున్నారా మీరు? ఈ కొమ్మన్న కుపితారుణ నేత్ర రుచుల ముందు కుమ్మరపురుగులు కాతలచుచున్నారా మంచిది. (కన్నమ వైపుగా తిరిగి) రణగండ్ల యుద్ధం తరువాత అస్త్ర సన్యాసం చేశాను. మళ్లీ కత్తి పట్టక తప్పదా?

కన్నమ : తండ్రీ! ఎంత మాట!


నీవై ఖడ్గము తాల్పగా వలెనె తండ్రీ! శత్రుపక్షంబులో
నీవాల్లభ్యము నోపగా గలుగు నువ్నీ లెవ్వ రున్నారు నా
పై విశ్వాసము నుంచి పంపుడట కస్మద్భాహు దర్పోద్ధతిన్
ఆ వీరావళి మస్తకంబులతొ మీకై క్రీడకావింపనే -


కొమ్మన్న : కన్నమా! నీవు నిజంగా అంతకు తగినవాడివి. నా గుండె మంటలను అనేక గుండె మంటలతో చల్లార్చగల వీరుడివి నీవొక్కడివే నాయనా! ఏకైక పుత్రుడు. రూపసి. రాజ్యతంత్రజ్ఞుడు ముద్దుబిడ్డ, అలరాజు. అబ్బా! ఎన్నాళ్లు ఎంత యత్నంమీద మరిచిపోతే మరపునకు వస్తాడు, నా తండ్రి. దారుణ మృత్యువు. హృదయంలో ప్రచండ ప్రతీకార జంఝామారుత రోదనం భరింప శక్యమా? కన్నమా!

కన్నమ : (ఉచ్చ కంఠంతో) మామా!

కొమ్మన్న : నురుమాడి అరివీర సస్యాన్ని అస్తిరాసులు తూరుపార పట్టవోయ్ తండ్రీ! వీరాధివీరుడవై, సకల సేనాపతివై, శత్రువుల పునుకల దండలతో ప్రేతపతికి కానుక లర్పించు. ఈ కసి అప్పటికైనా చల్లారుతుందేమో!

(సకల సేనాపతిత్వ చిహ్నమైన కరవాలాన్ని అందిస్తూ) ఈ కరవాలం ఇక నీది. కదన రంగాలను నడిపించవలసింది నీవు.

కన్నమ : (కత్తిని అందుకోటానికి చేయి జాపుతూ అంగీకారం కోసం ఎదురుచూస్తూ) తండ్రీ! మహారాజా!


48

వావిలాల సోమయాజులు సాహిత్యం-2