Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీమంతు: సోదరులారా! మీకో సంతోషవార్త తెలియజేయడానికి అడ్డువస్తున్నాను. క్షమించండి. కలెక్టరుగారు కారణాంతరాలవల్ల రాలేకపోయినామనీ, మన గ్రామాభ్యుదయాన్ని గురించి ప్రత్యేకచారులవల్ల విని, ఆనందించి ప్రభుత్వం వారికి తెలియజేశామని వార్త పంపించారు

(కరతాళ ధ్వనులు)

గోవర్ధ: మన ఉడతాభక్తి కార్యక్రమాన్ని చూసి వెళ్ళి ప్రభుత్వమే ఈ విధానాన్ని అన్ని గ్రామాల్లో అమలు పరచవచ్చు. అప్పుడు మన ఊరిపేరు మార్మోగి పోతుంది.

(కరతాళ ధ్వనులు)

శ్రీమంతు: అప్పుడు మన గోవర్ధనమ్మగారు, జగన్నాథంగారూ, కుటుంబరావుగారూ ఆఫీసర్లయిపోతారుగామాలి. మనం పంపటానికి వీల్లేదని వ్రాద్దాము. (కరతాళ ధ్వనులు) సోదర సోదరీమణులారా! మేమంతా వృద్ధులమైనాము. ఇక యువకులు ముందుకు రావాలి. వృద్ధులు వారికి స్థానమివ్వాలి. పదవులు అందిపట్టుకుని కూర్చోవటం సంఘద్రోహం. (భేష్... భేష్... భేష్...) ఈ ఉద్దేశంతో ఉడతాభక్తిగా ఇప్పుడే నేను వహిస్తున్న అన్ని అధ్యక్ష పదవులకు రాజీనామా ఇస్తున్నాను. జీవితాంతం వరకూ ఏ పదవీ స్వీకరించను. ఈ మార్గాన్నే అనుసరించమని పెద్దలకు నా మనవి.

(సెహబాస్, సెహబాస్)

సుబ్బా: మహాజనులారా! ఉడతాభక్తి కార్యక్రమానికి తోడ్పడ్డ మహాత్యాగమూర్తులందరికీ సేవాసంఘం కార్యనిర్వాహక వర్గం తరపున వందనాలర్పిస్తున్నాను. ఈనాటి స్వాతంత్య్ర దినోత్సవాలల్లో ఇంకా కార్యక్రమం ఎంతో వుంది. దానిలోనూ తరువాత స్త్రీలకు, పురుషులకు, బాలబాలికలకు ఏర్పాటు చేసిన సంఘం కార్యక్రమాల్లోనూ పాల్గొని ప్రయోజనాలు పొందవల సిందని ఇంతకంటె విరివిగా త్యాగం చేసి గ్రామాన్ని ఉద్ధరించవలసిందని మిమ్మల్ని పదే పదే ప్రార్థిస్తూ విరమిస్తున్నాను.

(దూరం నుంచి క్రింది గీతం వినిపిస్తుంది)


"ఉడతా భక్తితో ఉత్సాహంతో
ఇంకేం చేద్దాం ఈ గ్రామానికి
పిన్నలు పెద్దలు పేదలు ధనికులు
ఏం చేద్దాం మనమేం చేద్దాం”


ఎ.ఐ.ఆర్. విజయవాడ 15-8-1953


ఏకాంకికలు

447