శ్రీ డాక్టరు కుటుంబరావుగారు. మీ అనుమతితో వారికి గ్రామోద్ధారక బిరుదాన్ని ఇస్తున్నాను.
(జై గ్రామోద్ధారక కుటుంబరావుగారికీ జై)
కుటుం: మహాజనులారా! నేనీ బిరుదానికి అనర్హుణ్ణి. అంతేగాక గ్రామానికి నావల్ల జరిగిందేముంది. మీరంతా బీదలు, సాదలు, ధనికులు, కులమతవర్గ విచక్షణ లేకుండా ఉడతాభక్తిగా పిలుపు విని త్యాగం చేశారు. ఇంకా చేయటానికి సంసిద్ధులుగా ఉన్నారు. మనం సాధించవలసినవి ఇంకా ఎన్నో వున్నవి. దీనికి మహత్తర త్యాగం అవసరం. త్యాగం లేని సంఘం జీవించలేదు. ఇది ముఖ్య సిద్ధాంతం. మన మందరమూ ఉత్తమ సేవకులు అయిన శ్రీ జగన్నాథంగారికి ఎంతో ఋణపడ్డాము.
(జై జగన్నాథం గారికీ జై)
జగన్నాథం: సభాసదులారా! మనలో ఏ ఒక్కరూ మరొకరికి ఋణపడ లేదు. మనదంతా ఒక సమష్టి కుటుంబం. ఇందులో ఈర్ష్యలకు, క్రోధాలకు, విరోధాలకూ తావులేదు. అన్యోన్య సహకారం, ప్రేమ, మైత్రి యివి ఈ కుటుంబ సౌఖ్యానికి ముఖ్య సూత్రాలు. సంఘంలో ఒకరు ఎవరేమైనా నేను సుఖంగా ఉంటానని భావించటం తెలివితక్కువ. వ్యక్తి జీవితం సంఘజీవితం మీద ఆధారపడి వుంది. ఇది నగ్నమైన సత్యం. నాకు ఒకందుకు సంతోషం వేస్తున్నది. మన గ్రామంలో స్త్రీ లోకం ఇంత ఉత్సాహంతో ఇంతకు ముందు ఎన్నడూ సభల్లో పాల్గొనటం నేను చూడలేదు. దీని అంతటికి కారణం మన గోవర్ధనమ్మగారు.
(జై గోవర్ధనమ్మగారికీ జై)
గోవర్ధ: నామీద అభిమానం కొద్దీ సోదరులు నన్ను గురించి చెప్పినమాటను గురించి ప్రసంగించి కాలహరణం చెయ్యదలచుకోలేదు. ఈ స్వాతంత్య్రదినోత్సవ కార్యక్రమంలో ఎన్నెన్నో చిత్రవిచిత్ర విశేషాలను సోదరులు ఏర్పాటు చేశారు. కానీ ఒక్కమాట ఉడతాభక్తిగా అంతో, ఇంతో ధనమనండి, ధాన్యమనండి... లేదు శరీరకష్టమనండి... గ్రామోద్ధరణకు ధారపోయటానికి ముందంజ వేయని స్త్రీ మన గ్రామంలో లేదని నేను సగర్వంగా చెప్పగలను. మేము సంఘంలో మా స్థానాన్ని ఆక్రమించటానికి సమస్తవిధాలా కృషి చేస్తామని ఈ సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను. (కరతాళ ధ్వనులు) ఏనాటికైనా మన గ్రామం ఆంధ్రదేశంలో...
446
వావిలాల సోమయాజులు సాహిత్యం-2