Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బురావర్: ప్రజలంత మూర్ఖులని నేను నమ్మలేను.

అనూప్: (పెద్ద పెట్టుగా నవ్వి) అయితే నీవు గూడా నన్ను గురించి ఇదే అభిప్రాయపడుతున్నావన్నమాట...

బురావర్: ప్రస్తుతం దేశంలో రాజవంశం మీద కనిపించే అభిమానం, తిరుగుబాట్లు గమనిస్తుంటే ఎవరో కొందరు కుట్రదార్లు మిమ్మల్ని ప్రేరేపించి ఒక దుష్కృత్యం చేయించి మన వంశానికి తీరని కళంకం తెచ్చిపెట్టారని నా నమ్మకం.

అనూప్: (హృదయం బాధపడ్డట్లు) బురావర్ నా మిత్రులెవరో కుట్రదార్లు కాదు. నిజం నిలకడ మీద కాని తెలియదు. మేము చేసిన పనివల్ల ప్రజలకెంత లాభం కలిగేదో ముందు తెలుస్తుంది.

బురా: ఇది ఒక మహత్తర కార్యమని నేను మనస్ఫూర్తిగా నమ్మలేకుండా ఉన్నాను.

అనూప్: మంత్రి రావల్‌ను హత్య చేయమని నన్నెవరూ ప్రేరేపించలేదు. ఆ బుద్ధి నా మనస్సులోనే పుట్టింది.

బురా: అయితే మిమ్మల్ని చూడటానికి నాకేదో తెలియని భయం వేస్తున్నది.

అనూప్ (ఆర్ద్రంగా) నాయనా! బురావర్ నా ప్రయత్నాలన్నీ ఎందుకో హృదయం విప్పి ఆలోచించు. మనస్సులో ఎవరో కలిపిన విషాన్ని కక్కివేయి.

బురా: మీకు హృదయంలో రాజ్యంమీద గుప్తంగా కాంక్ష లేదా?

అనూప్: ఇంతవరకూ లేదు. ఉన్నా తప్పుకాదు. రాజ్యం వీరభోగ్యం. నేను వీరుణ్ణి. నా పుత్రుడవైన నీవు వీరుడవు. నీ అంతటిశక్తి ఒక సామాన్య సైనికునిగా ఉంటే నా మనస్సు చూడటానికి ఇష్టపడటం లేదు. నామీద అనుమానం మాను. సిరి తనంతట తాను వస్తుంటే మోకాలడ్డకు. రాయ్‌సింగ్ అసమర్థుడు. అతని పాలన అట్టేకాలం సాగదు. నన్ను రాజ్యపాలనను స్వీకరించమని మన ప్రజ కోరితే వృద్ధుడనని తప్పుకొని నిన్ను సింహాసనాధిష్ఠితుణ్ణి చేస్తాను. లే! ఇదిగో ఈ ఖడ్గం నీది. ఈ సేనలు నీవి. ఈ క్షణం నుంచీ నీవు సేనాధిపతివి.

బురా: (నిశ్చలకంఠంతో) తండ్రీ మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను.

(జై అనూప్‌సింగుకు జై, బురావర్‌కు జై నినాదాలు వినిపిస్తవి)

ఎ.ఐ.ఆర్. విజయవాడ 3-6-1952


438

వావిలాల సోమయాజులు సాహిత్యం-2