Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనూప్: తండ్రులు అసమర్థులైనప్పుడు భక్తివంతులైన కుమాళ్ళు రాజ్యపాలనను హస్తగతం చేసుకొని పాలించడం మన చరిత్రకు క్రొత్తది కాదు. పైగా క్షాత్ర ధర్మం కూడాను.

రాయ్: నాన్నగారు సమస్త సద్గుణాలూ కలవారు, ప్రజాభిమానం చేకొన్నవారు. వీరే రాజ్యార్హులు.

అనూప్: యువరాజా మీరు చేసేది వ్యర్థప్రయత్నం. ముల్రాజ్ మహారాజుగారికి ఇక రాజ్యం లభించటం కల్ల. రేపు ఉదయం శుభలగ్నం.

రాయ్: అనూప్ నీవు అనుసరిస్తున్నది దౌర్జన్య మార్గం. మంత్రి రావల్‌ను నీవు హత్య చేసింది ఇందుకోసమే కదూ?

అనూప్: ఈ మాటలతో ప్రయోజనం లేదు. మీరు సింహాసనం స్వీకరించే లోపల ప్రజాద్రోహ నేరం క్రింద ముల్రాజు మహాశయుడికి ఉరిశిక్ష జరగవలసి ఉంది. దానికి కూడా సర్వసన్నాహాలు పూర్తి చేయించాను.

రాయ్: (ఉద్వేగంతో) అనూప్ ఇది అన్యాయం అక్రమం దౌర్జన్యం.

అనూప్: మీ మాటలతో నాకేమీ ప్రయోజనం లేదు. త్వరగా ఒక నిశ్చయానికి రండి.

★★★

బురావర్: పితాజీ నమస్తే. ఎందుకో పిలిపించారు.

అనూప్: నీతో ఒక ఆంతరంగిక విషయం మాట్లాడవలసి రమ్మన్నాను. అలా నడుస్తూ మాట్లాడుదాము. ఈనాడు మన వంశానికీ, మన దేశానికీ, జాతికీ ఒక పరీక్షా సమయం వచ్చింది. రాజ్యరక్ష అతి ప్రమాదస్థితిలో పడిపోయింది.

బురా: మీ అభిప్రాయం ఏమిటో నాకు అవగతం కావడం లేదు.

అనూప్: నీ తోడ్పాటు ఇకనుంచి నాకు అతిశయంగా కావాలి. దేశభక్తి పరాయణులైన సర్దారుల సహాయంతో దుష్టమంత్రి రావల్‌ను హత్య చేయించాను. అసమర్థుడైన ముల్రాజ్‌ను కారాగారంలో నిల్పాను.

బురా: మీ ఉద్దేశాలేమైనా పైకి చెప్పటానికి ధైర్యం చాలకపోయినా లోకంలో ప్రజలు మిమ్మల్ని దేశద్రోహులుగా భావిస్తున్నారు.

అనూప్: ప్రజలు ఏమి భావిస్తే నాకెందుకు? ప్రజలు ఏమైనా అనుకుంటారు. వాళ్ళ మేలు వారికే తెలియని వెర్రివాళ్ళు ప్రజలు.


ఏకాంకికలు

437