మాలతి: మోసం! అన్యాయం!! మళ్ళా త్రిప్పుకుంటుంటే మరోదెబ్బ!! ప్రభూ! ఇది అన్యాయం, అక్రమం... అమ్మాయిగారూ గమనిస్తున్నారా! మోహియార్‌గారు మెలికలు తిరిగిపోతూ నోటరక్తం క్రక్కుతూ...
చంద్ర: రక్తమా! ఎంత అపశ్రుతి! అయ్యో నేలమీద పడిపోతున్నాడు. ఎంత ఘోరం, ఎంత అన్యాయం, నాన్నా... నాన్నా...
మాలతి: అయ్యో, అయ్యో... మళ్ళీ మర్మమైన ఆయువుపట్టులో మరొక దెబ్బ కొట్టాడు.
చంద్ర: నాన్నా! నాన్నా!
రంగ: చంద్రా!
మాలతి: ప్రభూ! అన్యాయం మోహియార్ మరణిస్తున్నాడు.
('అబ్బా బాధ' మూలుగు... హాహాకారాలు)
రంగ: చంద్రా! ఈ వెర్రిచూపులేమిటి తల్లీ! అయ్యో! రక్తస్రావము. ఆత్మహత్య చేసుకున్నావా...?
మాలతి: అమ్మో చంద్రవదన... నీ భర్త తెప్పరిల్లి మళ్ళీ శత్రువు మీద పోరాడుతున్నాడు.
చంద్ర: లేదు. మోహియార్ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. నేనూ నీతో వస్తున్నా.
రంగ: చంద్రా! నేను నీ తండ్రిని కాను నీ పాలిటి యముణ్ణి. అకారణంగా ఈ వరపరీక్ష కల్పించి నీ భర్తను హతమార్చాను. నన్ను క్షమించు.
చంద్ర: నాన్నా! మా పవిత్రప్రేమ లోకానికి అర్థం కాలేదు. కాకపోవడం తప్పులేదు. లోకానికి ప్రేమలేదు. వర్ణమున్నది. ఆచారాలున్నవి. అంతే లోకాన్ని అనుసరించి మోహియార్‌ను వివాహమాడిన నేను అన్యమతస్థురాలిని. నా భర్తతో సహగమనం చేశాను. మా ఇద్దరికి కలిసి ఒక గోరీ కట్టించండి. ఇదే నా తుది కోర్కె. అబ్బా... బాధ... నాన్నా! మాలతీ...
రంగ: పట్టరాని దుఃఖంతో చంద్రా! తల్లీ! నన్ను ఒంటరివాణ్ణి చేసి యీ లోకంలో నుంచి వెళ్ళిపోతున్నావా? క్రూరుణ్ణి... చేతులార నిన్ను చంపుకున్నాను., మరణశయ్య మీద వున్న నీ తల్లికి నిన్ను సర్వవిధాలా సంతోష పెడతానని వాగ్దానం చేశాను. లోకానికి వెరిచాను. పోనీ దేశంలో నుంచి మీ ఇద్దరినీ పంపించివేస్తే ఏ అరణ్యాలలోనైనా సుఖించేవారు.
426
వావిలాల సోమయాజులు సాహిత్యం-2