Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగమ్మ : మీ మనస్సు నేను ఎరుగనిదా? తీవ్రద్వేగంలో ఆ మాట తొందరమీద వచ్చేసింది. పాపం! పేరిందేవి పుట్టెడు దుఃఖంలో ఉంది. మీరు వెళ్ళి కొంచెం ఓదార్చండి. నేనూ వెంటనే బయలుదేరి వస్తాను.

(నలగామరాజు లేచి నాయకురాలు దారి చూపుతుంటే నిష్క్రమిస్తాడు. రాజు వెళ్ళిపోయే టంత వరకూ చూచి విజయ గర్వంతో తిరిగి వచ్చి)

నాగమ్మ : తంత్రం బాగానే పారింది. నలగాముడు నరసింహుడితో మాట్లాడడు. జంగిలే నరసింహుడితో జరిగినదంతా చెప్పివేస్తే? అతడు పట్టణానికి రాకముందే జంగిలిని దేవికి కానుకిస్తే?

తల్లీ - పేరిందేవీ! రాజ్యంతంత్రాలలో నీబోటి అమాయకులకూ, అనవసరమైన కష్టాలు వస్తుంటవి. అయ్యో నీకెంత ఆపద వచ్చింది.


కందును నీ శరీరము సుగాత్రిన వాతపరేఖ సోక నీ
అందము చంద మిట్టులతివా, చితి మంటలకయ్యె నోసి నా
డెందము కుందు నీకిది ఘటిల్లినదే గురు ఘోర మృత్యు సం
స్పందిత మామకీన మతి సర్పిత కోప విషాగ్ను లార్పగన్!


మహాదేవా! మహాదేవా!! ఇది నా తప్పిదము

కాదుగదా తండ్రీ! ఇందుకు నీవే సాక్షివి ప్రభూ!


(మహాదేవ విగ్రహం ముందు మోకరిల్లుతుంది)


42

వావిలాల సోమయాజులు సాహిత్యం-2