Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాలతి: అంతటి అనాకారివాణ్ణి నేనూ చూడలేదు. పోనీ అందమేమి కొరుక్కుతినేదా అని మాట్లాడించి చూస్తే అయ్యగారు వట్టి వెర్రిబాగులవాడు.

చంద్ర: నీవడిగిన కొంటె ప్రశ్నలకు సమాధానం చెప్పలేదేమో. తెలివిగలవాళ్ళందరూ నీబోటి వాచాలురతో అలాగే ప్రవర్తిస్తారు.

మాలతి: పోనీ వట్టి వాజమ్మలుగాని అధిక ప్రసంగం చెయ్యరని అనుకుందామంటే, చంద్రవదన అని నీ పేరు చెబితే వినీ విననట్లు ప్రవర్తిస్తే...

చంద్ర: నీవు అబద్దం చెపుతున్నావు. నీ అభిప్రాయమేమిటి?

మాలతి: ఏమీలేదు. అందచందాలూ ఆటపాటల్లో అన్నిట్లో నీకు తగ్గ వరుడు మన మాధవనాయుడు గారేనని నా అభిప్రాయం.

చంద్ర: మాలతీ, మరొక మాటు అతని పేరెత్తితే నేను సహించను.

మాలతి: నిద్రలో కూడా నీ పేరే స్మరిస్తుంటాడు గనక అతణ్ణి పెళ్ళాడితే సుఖిస్తావనీ, నీవు సుఖిస్తే చూసి ఆనందిద్దామని చెప్పాను గాని నాకెందుకు వచ్చింది. ఇంతకూ 'తామునిగినది గంగ'

చంద్ర: పోనీలే. ఇంతకూ వారెవరో కనుక్కున్నావా?

మాలతి: మీ పేరేమని ప్రశ్నించాను. అది నీకు చెప్పేది కాదు. నేనూ ఒక రాజవంశంలో జన్మించానని చెప్పాడు.

చంద్ర: రాజవంశంలో జన్మించకపోతే యిలా క్షాత్ర తేజం దుస్సాధ్యము. మరి, మన ప్రాంతంవారేనా?

మాలతి: మనస్సు ఇచ్చుకొన్న తరువాత మన ప్రాంతంవారైతేనేం? మరొక ప్రాంతం వారైతేనేం. మళ్ళీ రాబట్టుకోగలుగుతామా...?

చంద్ర: అందుకు నేనేమీ చింతపడడం లేదు. ముందు చింతపడను కూడాను.

మాలతి: అయినా, నీవంటి ఉత్తమ క్షత్రియ కాంత కుసుమ కోమల హృదయాన్ని ఒక అజ్ఞాతమైన తావున పారేయటం క్షేమం కాదు.

చంద్ర: మాలతీ! నీ విపరీత సంభాషణతో నా మనస్సు కలతపెట్టకు. జాలివహించు. సమస్తవిధాలా సాయపడు.


ఏకాంకికలు

417