Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగమ్మ : నా రాజభక్తినే మీరు శంకించిన తరువాత ఈ మంత్రిపదవి నాకెందుకు?

నలగామ : నా బుద్ధిగడ్డి తిన్నది. నన్ను నట్టేటిలో ముంచవద్దు. ఇవి చేతులు కావు. మీ ఇష్టప్రకారం అడుగు దాటను.

(వంగి చేతులు పట్టుకోబోతాడు)

నాగమ్మ : (సవినయంగా) అమ్మమ్మ! అంత అపచారమా? పాపం పేరిందేవి పిచ్చిపిల్ల. ఆమె మాటలు పట్టించుకోను. మిమ్మల్ని మాత్రం అనలేదు. మీ పిల్ల నా పిల్ల కాదూ?

నలగామ : (చిరునవ్వుతో) మహామంత్రిణీ! సంతోషము. అయితే, నరసింహుణ్ణి చంపి ప్రతీకారం చెయ్యవద్దనటంలో... విశేషాభిప్రాయమేమిటో అర్థం -

నాగమ్మ : అయితే మీ శత్రువులను సంపూర్ణంగా జయించ తలచుకోలేదా?

నలగామ : ఏమిటి?

నాగమ్మ : (మంత్రాలోచనగా) ప్రధాన సైన్యాలను నడిపించేది అతడు.

నలగామ : అవును. అయితే?

నాగమ్మ : అతని మీద కసి తీర్చుకోవటానికి ఇది సమయంకాదు. శత్రు సంహారం పూర్తి అయిన తరువాత.

నలగామ : (అర్థమైనట్లు తల త్రిప్పుతాడు)

నాగమ్మ : 'అల్లుణ్ణి చంపావా' అని ఎన్నడూ సంభాషణలోనైనా హెచ్చరించవద్దు. ఏదో అవకాశం చూచుకొని అభినందిస్తే పొంగిపోయి మీరు చెప్పినట్లల్లా నడుచుకుంటాడు. (చేయి జాపుతుంది)

(నలగామరాజు కొద్దిసేపు ఆలోచించి అంగీకార సూచకంగా చేతిలో చేయి వేస్తాడు)

నాగమ్మ : కోపాన్ని ప్రస్తుతం మరిచిపోలేరా?

నలగామ : ప్రయత్నం విశేషం అనవసరం.

నాగమ్మ : (దైన్యం నటిస్తూ) ప్రభూ! నా రాజభక్తిని ఎంత శంకించారు?

నలగామ : మహామంత్రిణీ! నా బుద్ధి గడ్డి తిన్నదని మళ్ళీ ఒకమాటు అనిపించ తలచుకున్నారా? ఇక మీరది మరిచిపోవాలి.


నాయకురాలు

41