అలరాజు : నాగమ్మా! సమస్త సంపదలతో తులతూగే సారవంతమైన వసుమతిని నా జన్మదేశాన్ని ఎందుకు నీ కడుపున పెట్టుకొని పాడు చేస్తావు. అన్ని విధాల అందె వేసినదనిపించుకున్న పలనాటి సీమకు నీవు అమ్మశక్తివై అవతరించావు. నిన్ను హత మారిస్తే కాని దేశం బాగుపడదు.
నరసింహ : (నవ్వుతూ) అలరాజూ! కొంచెం శాంతించవోయ్.
నాగమ్మ : ఉఁ నేను కదూ దేశాన్ని పాడు చేస్తున్నది. వర్ణాశ్రమాలకు స్వస్తి చెప్పించి వర్ణ సంకరం చేస్తున్న బ్రహ్మన్న దేశ క్షేమం కోరేవాడూ, నేను మాత్రం దేశ విద్రోహినా?
అలరాజు : అందులో రవ్వంత అబద్దం లేదు. నీవే దేశాభిమానివైతే 'హరీహరీ!' మేము దేశభక్తులమే కాదు. ముమ్మాటికీ నీవు దేశాభిమానివి కాదు. దేశద్రోహివి! దేశ విద్రోహివి! నీ బ్రతుకు దేశానికి అరిష్టదాయకము. నీ కాలినీడలు ఈ పుణ్యభూమికి కళంకం. నిన్ను కాల్చి మసి చేసి రక్తంలో కలుపుకొని త్రాగేటంత వరకూ నిద్ర పొయ్యే వ్యక్తి బ్రహ్మన్న మంత్రులవారి బలంలో ఒక్కడూ లేదు. ఆనాడు గాని మా కడుపులో చితి మంటలు చల్లారవు. నీకు మృత్యువు తప్పదు.
(కోపంతో వేగంగా నిష్క్రమించబోతే)
నరసింహ : (అడ్డుపడి నవ్వుతూ) అల్లుడూ! మామీద ఇంత కోపమైతే ఎలాగోయ్! ఇవాళ మా ఇంట విందు చేస్తేగాని పోనివ్వను.
అలరాజు : (వికట హాసంతో) మామా! మీరు ఎంత కైనా సమర్థులు. ఏ విషమైనా కలిపి ఇచ్చి ప్రాణాలు తియ్యవచ్చు.
నరసింహ : (నవ్వుతూ) శాంతించవోయ్ అల్లుడూ! కాస్త చిన్నా పెద్దను కనిపెట్టి మాట్లాడుతుండు, మరి - మేము బంధువులమని మరిచిపోకు. వ్యవహారం వ్యవహారమే. బంధుత్వం బంధుత్వమే.
(చేతిలో చెయ్యి పుచ్చుకొని నడిపించుకుంటూ నిష్క్రమిస్తాడు)
నాగమ్మ : (నటరాజస్వామి విగ్రహంతో) తండ్రీ! సమస్తమూ సక్రమంగానే సాగింది. సంధి నేను పడగొట్టించాననే అనుమానం లేకుండా నలగాముడి చేతనే ఆ పని చేయించాను. నరసింహుడు నా మాట మరిచిపోడు. అయితే అలరాజు అయిపోవటం వల్ల గొప్పలోటే. మేడ పైకి పోయి ఈ వార్తలన్నీ చెప్పి యుద్ధానికి సిద్ధపడేటట్లు
నాయకురాలు
35