Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొడుకు : పోలీసులు కూడా బీదవాళ్లే కదా, వాళ్లను కూడా ధనికులు బాధ పెడుతుంటారే మరి వాళ్లకు డబ్బుగలవాళ్లంటే ఎందుకు కోపముండదో!

తల్లి : వాళ్ల సంగతి మనం మాట్లాడకూడదు. ఎవరన్నా వింటే కొంప మీదికి వస్తుంది.

కొడుకు : పోనీవే. పేదవాళ్లంతా ఒకటై ధనికులకు ఏ పనీ చేయమని అంటే వాళ్లు ఏం చేస్తారో!

తల్లి : అటువంటివాటిని 'సమ్మె'లంటారు. అవి చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. కానీ పూట కూటికి లేనివాళ్లు గదూ వీళ్లు. ఇందులో కొంతమందికి మరింత డబ్బాశ పెట్టి మిగిలిన వాళ్లలో నుంచీ చీలదీస్తారు. అంతలో వీళ్ల సంఘబలం తగ్గిపోతుంది. చదువుకున్నవాళ్లు పోయి మంచి ఏదైనా చెప్పబోతే తాగి తందనాలు వేసేవీళ్లు మంచి చెడ్డలు అర్థం చేసుకోలేరు. ముందు రూపాయి వస్తుందిరా అని మనం చెప్పినా ఆ నిమిషాన 'కంటికి కల్లుకు - కావలసిన పావలా' కనిపిస్తే ధనికులకు దాసోహం చేస్తారు.

కొడుకు : అమ్మా! వాళ్లు ఉత్త అమాయకులు ఏ అన్నెం పున్నెం ఎరుగరు చదువు శూన్యం.... నా మనస్సుకు వాళ్లకేదైనా సహాయం చెయ్యాలని ఉత్సాహంగా ఉందమ్మా! మొదట్లో ఏం జెయ్యమంటావు నన్ను?

తల్లి : ఏమిటి చేసేది! నీ మొహం, ఆ ఆలోచన మానేసి నిద్దరపో కాసేపు. ఇంతలో నాన్న వచ్చే వేళౌతుంది. లేచి కాఫీ తాగి మాట్లాడుదువు గాని తీరికగా. నేనింకా కుంపటి రాజెయ్యాలి.

కొడుకు : నిద్దర!... నిద్దరే!! పట్టదు. ఎలా పడుతుంది!? ధనవంతుల మోటార్లు అరిగిపోతాయని పేదవాళ్ల చెవులు పిండి వసూలు చేసిన డబ్బుతో వాళ్లు తినటానికి లేకుండా మలమల మాడిపోతున్నా తారురోడ్లు వేయిస్తారటగా?

తల్లి : కన్నా! ఎవరు చెప్పారురా నీకిదంతా?

కొడుకు : ఎవరైతేనేం గాని అమ్మా! నా కన్నా అందంగా లేడు. తెలివి తేటలూ లేవు ఆ కోమటివాళ్ల అబ్బాయి మహాగర్వి, టాకు-టీకుగా కారులో బడికి వచ్చి ఇంటికి పోతుంటే కడుపులో ఏమిటో మంటగా ఉంటుంది. ఇకముందు వాణ్ణి చూచి అసహ్యించుకొంటాను. ఎగతాళి చేస్తాను!! ఏడిపిస్తాను!! రాయి తీసుకొని వెనకగుండా వాడి కారు అద్దాలు పగలగొడతాను!! అద్దం పెంకులు గుచ్చుకొని తల చిల్లిపడి రక్తం


332

వావిలాల సోమయాజులు సాహిత్యం-2