తల్లి : కానియ్యి నాయనా! నీ ఎదురుగా కూర్చొనే జవాబులు చెపుతాను - నాకు తెలిసినంతమటుకు.
కొడుకు : అందరికీ ఒకటే రకం ఇళ్లు లేకుండా ఒకళ్లకు బంగళాలు, ఒకళ్లకు పెంకుటిళ్లు, మన ఇంట్లో పనిచేసే రామి మొదలైనవాళ్లకు పూరిళ్లూ ఉన్నాయే దానికి కారణం ఏమిటమ్మా!
తల్లి : (నవ్వుతూ) చాలా చిన్న సమాధానము. డబ్బు బాగా ఉంటే బంగళాలు, కొంచెం తక్కువగా ఉంటే పెంకుటిళ్లు, అసలే లేకపోతే పూరిళ్లు.
కొడుకు : (మూతి బిగించి) నవ్వులాట కాదమ్మా. నా మనస్సు ఎంతో ఆందోళనగా ఉంది. వాళ్లకున్న డబ్బు వీళ్ళకు ఎందుకు లేదు?
తల్లి : ఎందుకు లేదు, అంటే - లేదు కాబట్టే.
కొడుకు : ఏమిటే అమ్మా ఆ పెడ సమాధానాలు!
తల్లి : అల్లాంటి ప్రశ్నలు వేస్తే మరి ఏం జవాబు చెప్పేదిరా?
కొడుకు : పుడుతూనే వాళ్లు ఏ లోకంలో నుంచైనా, తెచ్చుకున్నారా మరి!
తల్లి : లేదు. కాని వాళ్ల పూర్వులు సంపాదించి ఇచ్చిపోయినారు...
కొడుకు : వాళ్లకు మటుకూ ఇక్కడిదేగా డబ్బు సంపాదించటానికి. న్యాయాన్యాయాల భయము, పాపభీతి లేకుండా సంపాదిస్తే మటుకు వాళ్లదౌతుందా! తోడి మానవులు నీచాతి నీచంగా ఉంటే వాళ్ల హృదయం ఎలా సహిస్తుంది. అమ్మా! వాళ్ళకు హృదయం అనేది లేదేమో!
తల్లి : డబ్బు దగ్గిర నువ్వన్నవన్నీ అవసరం లేదు. దేవుడనేవాడు ఉంటే అతడు గూడా వాళ్లకే సహాయం చేస్తాడట.
కొడుకు : అమ్మా! దేవుడంటే జ్ఞాపకం వచ్చింది. నిన్న ఎవరో బ్రాహ్మడు వచ్చి కార్తిక సమారాధన చేయబోతున్నాము చందా వేయాలన్నాడు నాన్నను. ఆ డబ్బంతా పోగుచేసి మనబోటి బీదవాళ్ళకు ఎవరికన్నా ఇస్తారా ఏమే!
తల్లి : పిచ్చి నాయనా! నువ్వు చాల చిన్నవాడవు. నీకింకా ఏమి తెలియ దోయి. ఆ బ్రాహ్మలదేవుడు బీదలకు ఇవ్వమనేవాడు కాదు. వాళ్ల కడుపుకు తినమనేవాడు.
330
వావిలాల సోమయాజులు సాహిత్యం-2