Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భదంతుడు : నందా! ఏమిటిది?

నందుడు : నేను పాడమంటే పాడుతుండగా ఉపాసికకు మతి భ్రమణం కలిగింది.

అమితావి : అన్నీ అర్థంగాని మాటలు మాట్లాడుతున్నది.

నందుడు : భదంతా! ఇంత అందగత్తెకు ఈ కష్టం ఎందుకు వచ్చిందో - సంపన్నురాలి వలెనే కనిపిస్తున్నదే!

భదంతుడు : నాయనా! మీరు పూజా మందిరానికి వెళ్లిపోండి. ఉపాసికా!

ఉత్పల : భదంతా!

భదంతుడు : ఈ ఏకాంత ప్రదేశం నీకు క్రొత్త చేసినట్లుంది.

ఉత్పల : సుజాత గీతం వల్ల నా పూర్వ జీవితంలో కొన్ని ఘట్టాలు, స్మృతికి వచ్చినవి. అందువల్ల మనస్సు కొంత కళవళపడి ఉంటుంది తండ్రీ! ఏడేండ్ల నాడు ఎర్రని ఎండలో తిండిలేక మలమల మాడి చనిపోయిన నా ముద్దుబిడ్డ 'ఆకలి! ఆకలి' అని కంటిముందు రోదించాడు.

భదంతుడు : అమ్మా! అతణ్ణి గురించి ఆలోచించడం మానివెయ్యి. ఇనికిల స్వర్గంలో గంధర్వుడై అతడు యథేచ్ఛగా పాడుకుంటుంటాడు.

ఉత్పల : తండ్రీ! అతణ్ణి బ్రతికించుకోటానికే ఈ సంగీతం నాట్యం నేర్చుకున్నాను. కీర్తి గడించాను - ధనం ఆర్జించాను. ఇప్పుడు ఎవరికోసం?

భదంతుడు : ఇక నీకు పిల్లలు లేరా?

ఉత్పల : (వికటంగా నవ్వి) లోకంలో అందంగా కనుపించే పిల్లలందరూ నా పిల్లలే. దరిద్రురాలైనప్పుడు, పవిత్రురాలై నప్పుడు నే పాడిన పాట, ఆడిన ఆట ఎవర్నీ ఆకర్షించలేదు. దుర్వృత్తికి అలవాటు పడి నగర నర్తనశాలలో వేసిన గంతులన్నీ శాస్త్రార్థ వ్యాఖ్యానాలైనవి. లోకం గుడ్డిది. కళను అది అందుకోలేదు. లోకం కళకు శత్రువు! ప్రబల శత్రువు!!

భదంతుడు : అమ్మా! అంత ఉద్వేగివి కాబోకు.

ఉత్పల : భదంతా! లోకానికి ప్రేమ లేదు సత్యం లేదు శౌచం లేదు.


ఏకాంకికలు

327