నందుడు : అంత ప్రసిద్ధమైన పాటా తల్లీ!
ఉత్పల : ఉత్పల నిత్యమూ రాజలోకాల్నీ, నాగరకులనూ, ఈ పాటతోనే ముగ్ధులను చేస్తున్నది. పాడగల వాళ్ళకు ఈ పాట బ్రతుకు తెరువు కల్పిస్తున్నది.
నందుడు : అమ్మా! ఏమిటా వెర్రిచూపులు - అన్నా... అన్నా!
ఉత్పల : నా హృదయభారాన్ని లోకం ఎలా అర్థం చేసుకోగలుగు తుంది. నా చుట్టున్న పిశాచాలు నన్ను బంధిస్తున్నవి.
అమితావి : పిశాచాలే, బాబో !
నందుడు : అన్నా! ఈమెకు మతిభ్రంశం కలుగుతుందేమో!
అమితావి : పాములు పెంచుతున్నది కదూ?
నందుడు : 'ఇస్' - ఆమెకు వినపడితే బాగుండదు.
అమితావి : మనకు అతిథిగా వచ్చింది. - అమ్మా!
ఉత్పల : ప్రణయము! దుఃఖం - ఆశ, నిరాశ! కరుణా క్రౌర్యాల అవధులు చూచాను. మహా పట్టణంలో కంఠం కమిలిపోయేటట్లు అమృతగాన మొలికించినా కమికెడన్నం దొరకని కాఠిన్యం! బాధ! అబ్బా!
నందుడు : ఉపాసికా! నీ పాట మహాద్భుతంగా ఉంది.
ఉత్పల : (ఉద్వేగంతో) 'తుందిలా! నాకు ప్రశాంతి గంగా గర్భంలో దొరుకుతుందన్నావు గదూ? చేత చిరుపాపతో నిస్సహాయనై, నిర్ధననై, నిరాహారనై నిన్ను పాదాలంటి వేడుకొన్నానే - డబ్బు! డబ్బు! అమితావి : ఉపాసికా! ఉపాసికా!!
ఉత్పల : మాధ్వీ! కౌముదీ జాతరంలో నా నాట్యం! త్వరగా అలంకరించు. సభ ముగ్దమై పోవాలి... అబ్బా!
నందుడు : అమ్మా! మీకు దేహారోగ్యం సరిగా లేదా?
ఉత్పల : ఔను! దానివల్ల నాకేం లోపం. 'మహాజనులారా ఉత్పలకు ఈ దినం మన స్వాస్థ్యం లేదు. నాట్యం చెయ్యదు. ..... (పెద్ద పెట్టున నవ్వుతుంది) వెళ్ళిపొండి, వెళ్ళిపోండి.
326
వావిలాల సోమయాజులు సాహిత్యం-2