Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మణెమ్మ : ఏమందీ? పాయింట్ బ్లాంకుగా రెఫ్యూజ్ చేసింది.

పుణ్యకోటి : కారణం?

మణెమ్మ : ఆమె వివాహమే చేసుకోదట! అంతా 'స్పిన్స్టర్ ఫిలాసఫీ' మాట్లాడింది.

పుణ్యకోటి : చేసుకోక! పాపం, భుజంగంగారు ఆ కూతురువల్ల అపకీర్తి పాలౌతున్నాడు.-

మణెమ్మ : భుజంగంది కూడా కొంత లోపం ఉందిలెండి. ఆమె పేర కొంత ఆస్తి ఉంచాడు. అందువల్ల ఆమె స్వతంత్రంగా వ్యవహరిస్తున్నది.

పుణ్యకోటి : మళ్ళీ మీరు ఒక్కమాటు నాకోసం ఆమెతో మాట్లాడితే!

మణెమ్మ : ప్రయోజనం లేదు. మొన్నటిమాటల్లోనే తెలిసిపోయింది. అయినా ప్రస్తుతము ఆమెవల్ల నాకు ఎంతో దెబ్బ తగిలింది - మా మండలి ఎలక్షన్లలో ఓడిపోయినాను -

పుణ్యకోటి : అవునట, విన్నాను - అప్పటినుంచే నాకూ ఆమెంటే ఒక విరక్తి కలిగింది.

మణెమ్మ : అది నామీద అనురాగంగా మారలేదు గదా!

పుణ్యకోటి : స్యూర్! మీరు నాకెలాగైనా వివాహ విషయంలో సాయం చెయ్యాలి.

మణెమ్మ : (నవ్వుతూ) చేయగలిగినంత చేశాను. ఇక నా చేతనైంది, నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోవటమే - మరేమీ కనిపించటంలేదు, చెయ్యాల్సింది.

పుణ్యకోటి : నాకూ కావలసినంత డబ్బు ఏర్పడ్డది, మీ పుణ్యమా అంటూ, అనుభవించటానికి ఓ ఇల్లాలు మాత్రం కనిపించలేదు.

మణెమ్మ : అయితే మీకు మటుకు భార్య కావాలని అంత పట్టుదల ఎందుకు?

పుణ్యకోటి : తొందరలో జాగ్రత్త పడకపోతే భయమేస్తున్నది. ఎవరో ఓ అందమైన అమ్మాయి వలలో పడిపోయేట్టున్నాను. అందువల్లనే మిమ్మల్ని ఇంతగా బ్రతిమాలటం? - ఎక్కడైనా దయ ఉంచి ఓ మంచి సంబంధం చూచిపెడుదురూ?

మణెమ్మ : అయితే ఆ అమ్మాయికి ఉండవలసిన క్వాలిఫికేషన్సు?

పుణ్యకోటి : ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు. కాస్త దయాదాక్షిణ్యాలున్న ఒక హోం గ్రోన్ ఆర్టికల్ అయితే చాలు.

మణెమ్మ : నాకేమీ అర్థంకాలేదు.


280

వావిలాల సోమయాజులు సాహిత్యం-2