Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చైతన్యం : నిజమే, తప్పటంలేదు. భగవదనుగ్రహంవల్ల ఇంకా మనకు మంచిదినాలు రాలేదు. - నిత్యం ఏదో నదికి ఎదురీదవలసి వస్తున్నది రేణూ!

రేణు : మళ్ళీ ఏదన్నా రిపోర్టు పంపవలసి వచ్చిందా ఏమిటి?

చైతన్యం : భుజంగం మనమీద పాముపగ పట్టాడు. మనం చేస్తున్న కించిత్తు ప్రజాసేవ కూడా ముందుకు సాగేటట్టు లేదు. పడగొట్టటానికి అతడు బ్రహ్మప్రయత్నం చేస్తున్నాడు.

రేణు : ఇవాళ ఏదో పెద్ద కవరు వచ్చినట్లుంది?

చైతన్యం : మొన్న ఈ గ్రామంలో ఎవరో రామన్న చనిపోయినాడట! అతని బంధువులు వారసత్వం కోసం మనకు లంచమిస్తే మందుపెట్టి చంపామని మనమీద కేసు బనాయించారు.

రేణు : అతడు మనదగ్గిరకు మందుకే రాలేదు. ఎవరో ఆచార్లుగారు మందు ఇస్తే రోగం నయం కాలేదట! చాలాకాలం తీసుకొని చచ్చిపోయినాడు.

చైతన్యం : ఇదంతా విచారించేవాళ్లెవరు? కావలసినంత డబ్బుంది. మంచి ప్లీడరును పెట్టుకొని వాదిస్తాడు. మనం కేసులోనుంచి బయటపడకపోతే ఎంతో ప్రమాదం. దేశంలో అపకీర్తి మాట అలా ఉంచినా నా డాక్టరు సర్టిఫికేటుకు మోసం రావచ్చు.

రేణు : అయినా వాళ్ళకు సాక్ష్యం దొరకవద్దూ. గ్రామమంతా మన పక్షం చెప్పుతుంది.

చైతన్యం : డబ్బు పారేస్తే ఏ సాక్ష్యం చెప్పమంటే ఆ సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎందరైనా దొరుకుతారు. ఆ పాపం తన వృత్తిది గాని తనది కాదనే నమ్మకంతో అబద్ధపు సాక్ష్యం చెప్పించటానికి పాఠం నేర్పగల ప్లీడర్లు ఎంతోమంది దొరుకుతారు.

రేణు : మన తాత్కాలిక వైద్యశాల స్థలాన్ని గురించి కలెక్టరుగారికి వెళ్ళిన రిపోర్టు ఏమైంది?

చైతన్యం : ఈ ఆఫీసుల్లో దేముడు వరమిచ్చినా పూజారి వరమివ్వటం లేదు. తిరిగి తిరిగి నిన్ననే మళ్ళీ ఒకేడాదిపాటు పర్మిషన్ పుట్టించుకో వచ్చేటప్పటికి తలప్రాణం తోకకు వచ్చింది. - చేతిలో చిల్లిగవ్వలేదు. ఈ చిక్కుల్లో నుంచి ఎలా బయటపడటమో అర్థంకావటం లేదు.

రేణు : ఆ బెంగ పెట్టుకోకండి. నా పేర మా నాన్నగారు బ్యాంకులో వేసిన అకౌంటు ఆరువేల రూపాయలున్నవి.

చైతన్యం : రేణూ! నీ డబ్బు ఖర్చుపెట్టటం!


272

వావిలాల సోమయాజులు సాహిత్యం-2