Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆముఖము


నా ప్రథమ రూపక రచన 'నాయకురాలు' మీద ఆంధ్రంలోని వివిధ నగరాలల్లో ప్రేక్షకలోకం, విమర్శక మహాశయులూ చూపించిన ఆదరాభిమాన దోహదం వల్ల విజ్ఞులిచ్చిన వాత్సల్యపూర్వకమైన సలహాలను పురస్కరించుకొని రూపక వ్యవసాయం సాగించాను. తత్ఫలితంలో కొంతభాగాన్ని 'వసంతసేన', 'డాక్టరు చైతన్యం' రూపంగా నేడు ప్రదర్శిస్తున్నాను.

డాక్టరు చైతన్యాన్ని సృష్టించి నాలుగు సంవత్సరాలకు పైబడ్డది. అయినా ఇంతకంటె ముందుగా దీనిని ఆంధ్రనాటకరంగప్రియులకు నేను అందించలేక పోయినందుకు చింతిస్తున్నాను.

సేవాభినిరతులుగా పైకి కనిపిస్తూ స్వార్థంకోసం అన్ని అన్యాయాలతో బాటు ఎట్టి సాహసకృత్యాలకైనా వెనుదీయక ప్రవర్తించే 'భుజంగం' వంటి వ్యక్తులు సంఘం బలహీనంగా ఉన్న దినాలల్లో విరివిగా కనిపిస్తారు. వారి బాహ్యజీవితానికీ, ఆంతరంగిక జీవితానికీ సమన్వయం ఎక్కడా గోచరించదు. అటువంటివారిని స్వప్రయోజనాలకోసం మణెమ్మ, చంద్రశేఖరం, పుణ్యకోటి వంటి వ్యక్తులు అండ చేసుకొని ఉపజీవించటం సహజం. ప్రయోజనాలు నెరవేరిన తరువాతనో లేక ప్రమాదం సంభవిస్తుందన్న భయం కలగటం పొడకట్టిన మరుక్షణంలోనో దయ్యాలకొంపను వదిలేసినట్లుగా వారు తామాశ్రయించిన వారిని వదలివేస్తుంటారు. మణెమ్మను పోలిన ఏ ఒక స్వేచ్ఛా సంచారిణినో చూచి నవనాగరక స్త్రీ లోకం ఇలా ఉందని భ్రమపడటానికి అవకాశం లేదు.

డా. చైతన్యం వంటి మహాపురుషులు లోకంలో అరుదుగా కనిపిస్తారు. వారిని లోకం క్రమంగాగాని అర్థం చేసుకోలేదు. సత్యమూ, సత్పురుషులూ దాగదు, దాగరు. సత్యప్రియులు రేణు, జయమ్మలవంటి స్వచ్ఛహృదయాలను ఆకర్షించి చైతన్యంవలె మహత్తర కార్యసాధకులౌతారు. అటువంటి వారివల్లనే సంఘానికీ, దేశానికీ శక్తి, ముక్తి.


డాక్టరు చైతన్యం

215