Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చ. "కురు బలమున్ జయించి మనగోవుల దెచ్చెద" నంచు నుత్తరుం
     డరిగెను బాలుడతఁడు, మహాద్భుత విక్రములందు నున్నవా
     రరయ - విచారనీల జలదావృతమై మది తల్లడిల్లు, మీ
     రురుతర యోధముఖ్యుల రయోద్దతి, దోడ్పడ నంపుడీ తగన్.

ఉ. ఆటకొ పాటకొ పిలుచుటన్న తగున్, రిపు గెల్వగోరి యి
    ప్పాటున పోటుబంట వయి భండన భూమికి నేగువేళ వై
    రాటి! రథంపు సారథిగా రమ్మని పిల్తువు! పేడినైన నే
    నేటికి, నీకు సాటియగు నెవ్వని నైనను బల్వయోగ్యమౌ -

తే. రమణి! మద్భుజాబల పరిరక్షితంబు,
    ఏనె నిజమైన ప్రభువు నీ యిలకు - నాదు
    కన్నులించుక మందార కళికలైన
    విరటుఁడు క్షణము గద్దెపైఁ ఒరఁగఁగలఁడె?

తే. నన్నుఁ జేకొన్న యన్నుల మిన్న సతులఁ
    బిలిచి యపుడె నీ సేవ కర్పించుకొందు
    ప్రీతివడ నిత్తు నీవు సేవించు సోద
    రిని సుధేష్ణను సైరంధ్రిగను బ్రియాన.

తే. కనుమ, సోదర! ధర్మరక్షకుడ వైన
    నీకు తగునె యిది? తగదు నిశ్చయమ్ము
    చిత్త మొకట విచారమ్ము చెలఁగె నేని
    తలఁచి యదుపునఁ బెట్టఁగాఁ దగును దాని. 16

తే. రమణి కాలి గోటికి సరిరారు నిఖిల
    నాకలోక సురాంగనా నీక మక్క!
    ఎపుడు సేవకు నీవు చిక్కించుకొంటి
    వప్సరః కంఠ సుందరహార మణిని?

తే. అరయు చుంటి నాసతి, సవనాగ్ని కీల!
    దివ్యగుణవల్లి! సకల సాధ్వీమ తల్లి!!
    మోముఁ జూచినఁ బూజింప బుద్ధి వుట్ట
    ఇట్టి నీచపుటూహ నీకెట్లు గలిగె ?


86

వావిలాల సోమయాజులు సాహిత్యం-1