Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/771

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విలువైన వ్యాసాలు. ఆయా పద్యాలకు వారు వ్యాఖ్యలు గభీర సాహిత్య విశేష సమన్వితాలు అవన్నీ ఇప్పుడెవరైనా క్రోడీకరించుకొంటే పిహెచ్.డి. పట్టం పొందవచ్చు.

వావిలాలవారి లేఖిని నుండి జాలువారిన రచన ఏదైనా కానివ్వండి ఒక వైలక్షణ్యం ఉంటుంది.

నాలుగు దశాబ్దుల క్రితం వారు వెలువరించిన 'మణిప్రవాళము' అనే వ్యాససంపుటి తెలుగులో వ్యాసరచనకు మార్గదర్శకంగా ఉన్నదనటం పెద్ద లంగీకరించిన విషయం. ఒక్కొక్క వ్యాసంలో ఎన్నెన్ని విషయాలు చెప్పబడ్డాయి! అన్ని విషయాలు సేకరించటానికి ఎంత చదివి ఉండాలి! ఆ సేకరించిన విషయాలను పొందుపరచటంలో ఎంత అందం! ఆ శైలిలో ఎంత హొయలు!

వారి 'నాయకురాలు' నాటకం పలుమార్లు, ఆంధ్రదేశంలోను, ఆంధ్రేతర ప్రాంతాల్లోను ప్రదర్శింపబడి బహుజనరంజకమయినది. వారు రచించిన 'కజ్జల’ 'వసంతసేన' నాటకాలు వైలక్షణ్య రమణీయాలు. అయితే 'నాయకురాలు వలె ఇవి పలుప్రాంతాల్లో ప్రదర్శితాలు కాలేదు.

1950 ప్రాంతంలో వాత్స్యాయన కామసూత్రాలను మథించి, శాతవాహన సంచికలో వారు ప్రకటించిన వ్యాసం పరిమాణంలోనే కాక, విషయ విన్యాసంలో కూడా గొప్పది. ఎన్నో అపూర్వములూ, ఆసక్తికరములూ అయిన విషయాలు అందులో ఉన్నాయి.

వారి పద్యశిల్పానికి ముగ్ధులై డా॥ శ్రీ సి. నారాయణరెడ్డి గారు వారిని 'పద్యవిద్యాధరు' అని సంభావించారు. ఇంక వారి పద్యశిల్ప రామణీయకాన్ని గూర్చి వేరే చెప్పవలసిన దేమున్నది.

బహుభాషావేత్తలైన శ్రీ వావిలాలవారి అనువాద సాహిత్యం కూడా అనల్పమే!

మహాకవి శ్రీ జయశంకర్ ప్రసాద్ గారి 'కామాయని' హిందీ కావ్యానికి శ్రీ వావిలాల సోమయాజులు గారు తేటగీతి ఛందస్సులో తెలుగు అనువాదం సంతరించారు. ఇదొక విశిష్ట రచన. వేమన్న రసనపై ఆటవెలది నృత్యం చేసినట్లు సోమయాజులుగారి లేఖినిలో తేటగీతి కదను త్రొక్కింది. సుదీర్ఘ సంస్కృత సమాసగ్రథనానికి కూడా ఒదుగుబాటు చూపించి హొయలు గుల్కింది. ఈ కావ్యం తెలుగు భాషాయోష కొక వినూత్న భూష ___

_____________________________________________________________________________

ఉపాయనలు

771