Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/769

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇది ఇలా ఉంచండి. మొదట్లో - త్రికళావిర్భావాన్ని గురించి ముచ్చటించు కున్నాం. అక్కడ శ్రీ వావిలాలవారు, శ్రీ ఆదిభట్టు వారు శ్రీ కఱ్ఱావారు - ఈ మువ్వురి చూపులకలయిక వల్ల ఈ కావ్యం ఆవిర్భవించింది అనుకున్నాం. శ్రీ వావిలాలవారు శ్రీ కఱ్ఱావారు - వారిరువురి చూపులు కలసినవనటంలో సామంజస్యం ఉన్నది గాని 'హరికథాపితామహుల' చూపు కలిసిందనటంలో సామంజస్య మేమిటి? ఇది ఎలా సంగత మౌతుంది అనే శంక కలుగవచ్చును.

"ఈ సర్వమూ శ్రీ దాసుగారిని గురించే కదా!" అని నే ననబోవటం లేదు.

“స్వయంలేఖనము” అనే ప్రక్రియ ఒకటి ఉన్నది. దానిని ఇంగ్లీషులో 'ఆటో- రైటింగ్' అంటారు.

స్థూల శరీరాన్ని విడిచి గతించిపోయిన జీవాత్మ ఒక మానవుని మీదికి ఆవాహన చేసినప్పుడు, ఆ మానవుణ్ణి ఆవహించి అతనిచేత తాను చెప్పదలచుకొన్నది వ్రాయింప జేస్తుంది. వ్రాసేవాడు ఒట్టి సాధనం మాత్రమే! అతని చేయి, ఆ చేతిలోని కలం కదులుతుందే తప్ప, ఆ వ్రాసే వ్రాతతో అతని కెట్టి సంబంధమూ ఉండదు. వ్రాసేదంతా అతణ్ణి ఆవహించిన జీవాత్మయే. ఇలా గతించిన జీవాత్మకు సాధనంగా ఉపయోగపడేవారు పురుషులూ కావచ్చు స్త్రీలూ కావచ్చు. అయితే అందరూ ఇందుకు పనికిరారు. ఇందుకు సాధనంగా పనికివచ్చే వారు కొందరే ఉంటారు. శ్రీ దాసుగారి స్వయంలేఖనానికి శ్రీ కఱ్ఱా ఈశ్వరరావుగారి ప్రథమ పుత్రిక చి||ల||సౌ|| రాజేశ్వరి సాధనమయింది.


..........ఎపుడో శరీరాన్ని
విడిచి నట్టి దాసుగారు
తనదు జన్మరహస్యాన్ని
ప్రపంచాన్కి బహిర్గతము
చేయటాన్కి శ్రీ ఈశ్వర
రావుగారి ప్రథమపుత్రి
ని చిరంజీవి లక్ష్మీసౌభాగ్యవతిని రాజేశ్వరి
దేవి నొక్క ఉపకరణము
గా గ్రహించి తన అదృశ్య

వాణి నామె కందజేసి

________________________________________________________________________________

ఉపాయనలు

769