Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/694

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చేసెను. అన్నగారి మృత్యువునకు రెండు సంవత్సరముల పూర్వమే మమతామూర్తియగు మాతృమూర్తి గతించెను. దీనివలన కైశోరావస్థను దాటీ - దాటకుండగనే, అతనిపై బృహత్తరమగు సంసారభారము పడెను. ఈ విషమస్థితిలో ఆయన దార్శనిక చింతనము ఆయనను పూర్తిగా క్రుంగిపోకుండగ కాపాడెను. ఇట్లుండగ ఆయన తన వదినెగారి ప్రేరణతో ఇష్టము లేకున్నా వివాహము చేసికొనెను. ఆమె అకాల మృత్యువువాత పడగ, తిరిగి ద్వితీయ వివాహము చేసికొనెను. ఆమెగూడ కాలగతి చెందగా, తృతీయ వివాహమునుగూడ చేసికొనవలసి వచ్చెను. ఈ విధముగ ఆయనకు జీవిత ప్రథమదశలోనే సంభవించిన ఆకస్మిక బంధుమరణములు ఆయనను 'నియతివాది' లేక 'భాగ్యవాది'గా మార్చివేసెను.

ఇక కుటుంబముపైబడిన ఋణభారమును (పైతృకఋణమును) తొలగించు కొనుటకై శ్రీ ప్రసాద్ రెండు - మూడు దశకముల పాటు తమవ్యాపారమును చాల దీక్షతో కొనసాగించవలసి వచ్చెను. ఐనను ధృతిని వీడక తమ వ్యాపారమును పట్టుదలతో కొనసాగించుటతోబాటుగ, తన కవితా వ్యవసాయమును గూడ అకుంఠితదీక్షతో సాగించి కృతకృత్యుడాయెను.

ఇక మఱియొక, నిగూఢమైన జీవితరహస్యము. ఆయన తన యౌవనారంభ దశలో ఒక యువతిని ప్రేమించెను. ఆ యువతిని గూర్చిన ఆ నిగూఢ ప్రేమగూడ నియతి ప్రాతికూల్యమున భగ్నమాయెను. ఈ 'భగ్నప్రేమ' ఆయనను అనంత విరహవేదనకు గుఱిచేసెను. ఆ విరహవేదన, ఆంసూలోని ప్రతిఛందస్సులోను కొట్టవచ్చినట్లు గాన వచ్చును. కాని ఆయనలోని దార్శనికుడు, ఆయనలోని భావుకుడు, ఆ భగ్నప్రేమను వైయక్తికమగు సంకీర్ణ పరిధినుండి ఈవలకు లాగి, సార్వభౌమముగను, భౌతిక వియోగవ్యథను ఆధ్యాత్మికముగను రూపొందించుటచే, అది అనంత వియోగవ్యథితులగు ఆధ్యాత్మిక వియోగులగు జనులకు నిరంతర సేవ్యమై, వియోగపీడితులకు జీవితసంబలమై తనరారునల్లొనరించినాడు. ఈ కావ్యములోని విశేషమేమియన, అనంత వియోగ వ్యథితుడగు కవి, తన ప్రేమకు పాత్రము ఐన వ్యక్తి, ఒక 'ప్రేయసి' యనుభావమును మఱగు పఱచి సర్వత్రా పుంలిఙ్గమునే ఆ ప్రేయసిని గూర్చి ప్రయోగించినాడు. అనగా 'ప్రియా' అని స్త్రీలింగముగ తన విరహాలంబన మును ప్రకటించక 'ప్రియ' అని పుంలిఙ్గములో నుపయోగించినాడు. ఈ క్రింద ఇచ్చిన పంక్తులను చూడుడు: