ఆనందము (ఆనందం) తే. తీసికొని కావలసిన పాథేయ మప్పు డొక్క యాత్రికదళము సముత్సుకతను నాపగా రమ్యతీరమం దమల మృదుల పృథుశీ లోచ్చయ మార్గాన వెడలుచుండ్రి.
తే. ధర్మమునకుఁ బ్రతినిధి యౌ ధవళ వృషభ మావృతమ్మయ్యె సోమలతాళి, నద్ది గళ ఘటిత ఘంటికా తాళగతులు మొరయ ధీర మంథర గమనానఁ దేజరిల్లు.
తే. నామకరమున వృషభఁపు దామనయును, నితర హస్తమున ద్రిశూల మెలమిఁ దోప నమిత తేజో విరాజమా నాననుండు మానవుఁడు దాని వెనువెంట మసలుచుండె.
తే. అభినవములైన యాతని యంగకములు సింగపు బిల్లకును బోలెఁ జెలఁగుచుండె అమిత గాంభీర్యమున నొప్పు యౌవనమ్ము! నిండి కల వందు నవభావనిధులు కొన్ని.
తే. ఉక్షమునకు రెండవ ప్రక్క నుండి, వనిత ఇడ యపుడు సద్దుసేయక నేగుచుండె సంజవలెఁ గావిఁ గట్టె నా సాధ్వి, వినఁగఁ గలరవము లేదు, మౌనమ్ము చెలువుమెరసె.
తే. లలితమోహన యువజ నోల్లాసములును, శిశుగణ మృదు కలరవ విశేషములును, కామినీజన మంగళ గానములును దివిరి ధ్వనియించుచుండె యాత్రికదళమ్ము.