తే. అగణిత బ్రహ్మగోళముల్ పగిలి చెదరె అవధి గన్నట్టి యుగము సమాప్తమయ్యె విద్యు దుపమిత నేత్రాంతవీక్ష వడిన తావులం దెల్ల సృష్టి వ్యత్యస్త మయ్యె.
తే. చేతన పరమాణువులు విశ్లేషమొంది క్షణములో రూపుఁగొని లీనగతులఁ దారె ఒక మహాడోలవలె విశ్వ మూగుచుండెం దనరి - విప్పుకొనెఁ బరివర్తన పటమ్ము.
తే. శాప పాపముల వినాశన మ్మొనర్చి యట్టి శక్తిశరీరు ననంతకాంతి నాట్యరత మయ్యె - ప్రకృతి విన్నాణములను గరఁగి యా ప్రభాజలనిధిఁ గలసి యంత...
తే. దిద్దుకొనె నిజ మోహన దివ్యమూర్తి భీషణమ్ములు రమ్యతా పేటికలుగఁ బరఁగె - విద్యుద్విలాసమై వజ్రగిరిని నమలి నోల్లాస నీహార హాస మొదవె!
తే. ఎలమిని మనువు నటన్నటేశుఁ జూచి చేతనా హీనత నొకట నాతి కనియె: "శ్రద్ధ! ఇది యేమి? ఘన సమరస మఖండ మమల మానంద రూపమై యమరుచుండె?
తే. ఎందుఁ బుణ్యపాపములు తపించి నిర్మ లమ్ము పావన మౌను క్షర మటు, జ్ఞాన లేశమును మాయు నా పాదదేశమునకుఁ జేర్పు మందించి కర సరసీరుహమ్ము”