తే. కోకిలా దేవి హర్షానఁ గుసుమమునకు
వచ్చి మధుమయసం దేశ మిచ్చినటులఁ
గడఁగి సవిశేషమగు సముత్కంఠ నడిపి
పల్కసాగె నాగంతుకవ్యక్తి యంత.
తే. "తండ్రి కతిప్రియమైన సంతాన మేను
ఇచట, గంధర్వభూమి, వసించి భవ్య
లలితకళలందు జ్ఞానమార్జనమొనర్ప
హృది నవోత్సాహ నిబిడమై యెసఁగుచుండె.
తే. ముక్త గగనాన జరియించు రక్తి బలిసి
నిత్యమభ్యాసమౌటను నెఱిఁ జెలంగె
వ్యస్తహృదయము బహుకుతూహలము మెరయ
విమలరమ్య సత్సత్యము న్వెదకుచుండె.
తే. అహహ! దృష్టి హిమగిరిపై కరిగినంత
నధిక భీరుతఁ బ్రశ్నించు నాత్మ యిట్లు
“వసుమతీలక్ష్మికి భీతివళి ఇదేమి?
పృథ్వికిట సంభవించిన పీడ యేమి?"
తే. తనరి మౌనాన నాత్మసౌందర్యమునకు
దివ్యమగు మహాసుప్తసందేశ మొకటి
సజగమౌచు సంకేతమ్ము సలుపఁ గడఁగె—
తా హఠమొనర్చె ముగ్ధచైతన్య మపుడు.
తే. మరులుగొని ముందునకు సాగె మానసమ్ము
పాదములు దాని వెనువెంటఁ బరఁగె కంటి
యాకలియె తీరె కామనగాళిఁ గనఁగ
వింత రమణీయసంభార మిద్ది, యహహ!
తే. ఒక్క దినమున దరిలేని యుదధి రేగి
క్షుబ్దమై డీకొనఁగ సాగె క్షోణిధరము