'ఆశ (ఆసక్తి)'
తే. సాగి జయలక్ష్మి పోల్కి నుషస్సు పొలిచి
స్వర్ణతీరాన్ని కాంతివర్షమున ముంచె
గాఢమగు నపజయమునఁ గాళరాత్రి
తతజలాల నంతర్నిహితమ్ము నొందె.
తే. ప్రకృతి భీవివర్ణ వదనపద్మ మంతఁ
దిరిగి హసియింపసాగె సందీప్తరుచుల
వర్షము గతించెను శరత్తు హర్షఫుల్ల-
నవ్యతల సృష్టియందు విన్యసన సేసె.
తే. స్నిగ్ధపింగపరాగ మునిషితముగ్ధ
సీతసరోజానఁ గ్రీడించు చెలువు మెరసి
రమ్యనవాలోకనము హిమరాసి నపుడు
రాగమున ముంచి వ్యాపించె లలితగతుల.
తే. సకలధరణిపైఁ గల హిమాచ్ఛాదనమ్ము
వీడసాగెను - మేల్కొని వృక్షసమితి
యలసతల శీతజలముల నాచరించెఁ
జతురిమలు దోపఁగా ముఖక్షాళనములు.
తే. నేత్రములఁ జేసె ప్రకృతి యున్మీలనమ్ము
సరవి నది ప్రబుద్ధమును గాసాగె నంత
వెర్రికడలి యలల యొళ్ళువిరుపు తరుగ
మాటిమాటికి వహియించె మందగతులు.
తే. ప్రళయ శార్వరీకల్లోల ప్రస్మృతులకు
నలసినటు, బిర్రుగ బిగిసినటులఁ దోఁచి
యపుడు సర్వంసహావధు నబ్ది- శయ్య
సంకుచితమూర్తిఁ గూర్చున్న సరణి మెరసె.
ఆంధ్ర కామాయని
489