తే. "కుసుమిత నికుంజకేళుల కొమరు గొన్న
వారి పులకితాలింగనప్రౌఢి సడలె
ముగ్ద సంగీత తానముల్ మూగవోయె
కెరలి చెవుల సోకదు వల్లకీరుతమ్ము. 35
తే. “వాసనల నిండి నిశ్వాస పవనచయము
నిలువఁగా బోదు చెక్కిళ్ల నీడవోలె
సురత శైథిల్య వసనముల్ చుట్టుకొనవు
శ్రమ మనోజ్ఞము లగు వపుస్స్కంధములను.
తే. "ఓపి క్వణియించుఁ గంకణనూపురములు
చెలఁగి వక్షాన హారముల్ చిందుఁద్రొక్కుఁ
గలరవమ్ములఁ బ్రతిరుతిగతులు తోఁచు
స్వరలయమ్ములు గీతాళి సంగమించు.
తే. "సౌరభస్ఫూర్తి నమరు దిశాంతసమితి
చతుర కాంతిమెయి నభము చంచలమ్ము
అన్నిటను దోఁచుచున్నది యట్టివేళ
మలయపవన ముద్వృత్తి నున్మత్తకేళి.
తే. "ఆ యనంగ వ్యథానుభవాంగ భంగి
మలను నృత్యమ్ము సాగెను జెలఁగి చెలఁగి
షట్పదీ పుష్పరస మహోత్సవము వోలి
వరలె మదిరారసాసక్తి మరల మరల.
తే. "వర సురాగంధములఁ దోగు వదనములను
నరుణనేత్రాళి నలసత, హార్ద రాగ
మమరు సుందరములు కపోలములు వానిఁ
గనినఁ బీత కల్పక పరాగములు బెగడు. 40
తే. "ప్రతినిధులు తృప్తి నెఱుఁగని వ్యసనములకు
వాడి, దగ్ధమై, నిజ సృష్ట వహ్నికీల
భయద వాత్యా రయోద్ధత ప్రళయకాల
జలధి జలమున వారు నాశనముఁ గొనిరి.
482
వావిలాల సోమయాజులు సాహిత్యం-1