తే. బుద్ధి యెవ్వరి కుండు విశుద్ధముగను
వారి కొక్కరికే బుద్ధి పరము, ఘనము
నైన దా బ్రహ్మ భావమ్ము నందు నిత్య
మయిన నిలకడ కలుగు సత్యమ్ము, కనగ. - వావిలాల సోమయాజులు
తే. సాటి మనుజులదైన కష్టమ్ము నెఱిఁగి
యెంత మేరకు నది తొలగింపగలుగు
నంతమేరకు సాధించి నట్ల యతఁడు
ఘనతరమ్మైన విజయమ్ము ఘనముగాను.-- మహాత్మా గాంధీ
తే. ప్రళయ సమయమ్ము నందైన బరిని దా
కుండ నియమవంతు లెచట నుండుటరుదు
చలనమొంద రెపుడును నచలముల గతి
వారు కళవళ పడరు పర్వతములటుల- మహర్షి మలయాళస్వామి
తే. ధనము లేకుంటనైన నిర్ధనుడు, దైవ
ధనుఁడయిన యెడ నిజమైన ధనుఁడతండె
ధనము కలిగి యైనను మహాధనుడు దైవ
ధనము లేకున్న నగును నిర్ధనుఁడతండె.- మహర్షి మలయాళస్వామి
తే. ఉన్న సంసారమున గల్గియున్న నెవ్వ
డాత్మ సన్యాస మతఁడె సన్యాసి యగును
అయ్యు సన్యాసి ఆత్మ సన్యాస మెఱుఁగ
నతఁ డగును మహాసంసారి యరసి నంత.- మహర్షి మలయాళస్వామి
తే. మంచివాఁడుగ నుండెడి మానవుండు,
మంచిగావింపఁదలంచెడి మానవుండు,
వీరలిరువురు నిల నెల్లవేళలందు
గడఁగి యుండఁగ రాదధికార మందు.- మహాత్మా గాంధీ
తే. "అల్పసంఖ్యాక వర్గాల నాదరించు
క్రమము జనతతి నాగరికతను దెలుపు"- మహాత్మా గాంధీ
254
వావిలాల సోమయాజులు సాహిత్యం-1