Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. అధికతర తపస్సంపన్నులైన ఋషులు
    సైతము విధి వక్రించిన సమయమునను
    నియమ నిష్ఠలఁ గోల్పోయి నిశ్చయముగ
    కామక్రోధాదులకు లొంగి కడగఁగలరు.

తే. ధనము, ధాన్యాలు సమకూరు ధర్మమునను
    లభ్యములగు సౌఖ్యములు ధర్మమ్ము వలన
    ధర్మ మొనరింప ధరను పొందనిది లేదు
    పొడము ధర్మమొక్కటి సారభూతమగుచు.

తే. పెద్దల యభిప్రాయమును సంప్రీతి గౌర
    వించి, నిరతమును ననుసరింతు మేని
    స్వర్గమును, సర్వధనమును, సకల ధాన్య
    ములను, పుత్రుల, సుఖముల పొందవచ్చు.

తే. కానబడడు లోకమున దుఃఖమ్ముతోడ
    సాయమును బొందియున్న శత్రువు కనఁగ
    నాశమొనరించు నద్ది జ్ఞానమ్ము, ధైర్య
    పరమ బలము నితర సర్వవస్తు చయము.

తే. బంధితులు సేయ మనల నుపాయములను
    జ్ఞాతులే తెల్పుచుందురు కాన మనము
    యెరిగి దీనిని జ్ఞాతులె యెంతవరకు
    నాప దలగుదురో తెలియంగఁ దగును. 18

తే. గడచిపోయిన యుద్దానిఁ దడవి, దాని
    గూర్చి యోజించు టెంతయుఁ గూడని పని
    గత మదెదియైన నెవ్వేళ గతము కానఁ
    జేయవలసిన దెదియొ యోజింపవలయు.

తే. గడుపుకొనఁదయ పని నిచ్చకములఁ బలుకు
   వార లెవ్వేళ నెందరో చేరుచుంద్రు
   హితవు కోరి చెప్పెడువార లెంద్రులేరు
   వారు దొరికిన వినియెడువారు లేరు.


మధుప్రప

229