తే. ఎంతో క్రూరుఁడై ప్రజను శిక్షించువాఁడు,
నఖిల జనులకు వ్యతిరేకి యైనవాఁడు,
వాని కింద్రియ దారణ్యము లేనివాఁడు
రాజ్యమున కీయఁగా లేఁడు రక్షణమ్ము.107
తే. ఆయశక్తుడౌ సారథి దైనరద్రము
భగ్నమై నెట్టులుగ నెత్తు పల్లములను
రాజులసమర్థులైన మంత్రాంగ జనులు
కష్టములు పొందెద రిల ప్రగాఢముగను.108
తే. క్రోధపూరితుఁడును ప్రతికూలుఁ డయిన
ప్రభువుచే రక్షణను బొందు ప్రజలు నక్క
పాలనం దున్న మేఁకల పగిది నెపుడు
వృద్ధి నొందరు, నిజము, నశింత్రు, నిజము!109
తే. గింజ చల్లిన వెంటనే కెరలి పెరిగి
పంట యిచ్చుట జరుగని పనియెయౌను,
కాలమవసర మట్లా దుష్కర్మఁ జేసి
నతని కీయదు ఫలితమ్మతిత్వరాన.110
తే. జనుల నైజములను మార్ప సాధ్యపడదు
దుష్టులేదొ కారణమ్మునఁ దోచి మంచి
స్వీకరించిన నది కడు సేపు నిలువ
దన్న యంశ మెంతయొ నిశ్చయమ్ము సుమ్ము.111
తే. పూనుకొని యొక పని పరిపూర్తి చేయ
ధర్మమును, కీర్తి యెదియును దక్కనట్టి
శ్రమను గల్పించు కార్యమ్ము సలుప నెవఁడు
చేయ యత్నించు నుత్సాహ శీలమునను.112
తే. చావు దరిఁజేరు చున్నట్టి సమయమందు
హాని నెంతయుఁ గల్గించువానిఁ గోరు
నట్లు నీవు మేలు నొసఁగ నట్టి వాని
స్వీకరింపంగ యత్నమ్ము సేతువేల?113
206
వావిలాల సోమయాజులు సాహిత్యం-1