Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. వశయుఁ బుత్రద యైనట్టి భార్యవలన
    కామధర్మార్థములు మూఁడు కలిగినటుల,
    ధర్మ మొనరింపఁగను ఫలితమ్మువలనఁ
    గల్గుఁ బైమూఁడు - ధర్మమ్ము ఘనతమమ్ము. 18

తే. ధర్మకార్యమ్ము గావింపఁ దగిన యుద్ది
    ఇతర పురుషార్థములను గావింప రాదు
    ఎవ్వఁ డర్థ ప్రధానుఁడో, ఎవఁడు కామ
    ప్రియుఁడొ వారు జగతి గౌరవింపఁబడరు.19

తే. ఎవ్వరసమర్థులో, భీరులెవరో, వార
    లనుసరింతురు దైవమ్ము ననవరతము
    ఎవరు సంభావితాత్ములో, ఎవరు వీర
    ధనులొ, వారు దేవు పయి నాధార పడరు.20

తే. ఎవ్వఁడు పురుషకారాన నీశుఁ గెల్చు
    నతఁడు తన కార్యములఁ బరమాత్మ కార
    ణముగ హానిని బొంది యేనాఁడు దుఃఖి
    తుండు కాఁడిది సత్యమైయుండు నెపుడు.21

తే. ఉత్తమ శ్రేణికి చెందు యువిద యయ్యు
    వ్రతము, లుపవాసములు సేయు, వనిత యయ్యు
    ఉత్తమ క్షేమముల భర్త కొసఁగు నట్టి
    పనులఁ గావింపకున్నచో పాపమొందు.22

తే. భర్తృ శుశ్రూష యొనరింప స్వర్గమందు
    దైవపూజ యొనర్పక దైవవంద
    నమ్మొనర్పక యుండెడి నాతియైన
    నిజము ఇయ్యది ఇయ్యది నిజము నిజము!23

తే. ఎల్లవేళల భర్తకు హితము, ప్రియము
    నాచరించెడు నాసక్తి యతివ సేవ
    చేయుచుండఁగ వలయును, స్నిగ్ధమిద్ది
    వేద సమ్మతమ్ము, స్మృతి విదితమయ్యె.24


మధుప్రప

193