తే. చిన్నతన మందె భరతునిఁ జేర్చి మేన
మామ కడ నుంచితివి యుండె రాముఁ డిచటం
దండ్రికడ, ప్రేమ పెరుగును స్థావరమ్ము
లందు రీతి సామీప్యమ్ము పొందినపుడె. 11
తే. జలము స్రవియించి గడచిన సమయమందు
నడ్డుకట్టలు గట్టుట యర్హమగునె
కనుక సమయమ్ము మించక మునుపె నీకు
శుభము నొసఁగెడు పనిఁ జేయఁ జూడు మయ్య.12
తే. వాస్తవమునకు బద్ధుండు నార్ధి అందు
వలన సత్యము దాటెడి భయము వలన
వృద్ధి నొందంగ వలసిన వేళయయ్యుఁ
దనదు పరిమిత తీరమున్ దాటమాను.13
తే. సత్యమేకాక్షరమ్ము - 'ఓమ్', సత్యమందె
యుండు ధర్మస్వరూపమ్ము ఉండు వేద
మూర్తిగను సత్యమున్నట్టి ముఖ్యమైన
వన్నియును సత్యమూలాన నందవలయు.14
తే. పాలకుఁడు లేని పశువుల పగిది సేన
నాయకుఁడు లేక పొందు వినాశనమ్ము!
చంద్రరహిత రాత్రియు, వృషభేంద్ర రహిత
గోవులును నవు రాజు లేకున్న భూమి.15
తే. భరతు పక్షమ్మువారిని, భరతు హితముఁ
గోరువారిని నందఱఁ గూల్చివైతు
ఏలయన మృదుశీలు నిన్నెల్లవారుఁ
జేతు రవమాన మొక్కింత నీతిలేక.16
తే. ధర్మమతి ముఖ్యము పురుషార్థములలోన
ధర్మముల లే దధికము సత్యమ్ము కంటె,
తండ్రిగారి వచనము లుత్తమము, లాశ్ర
యించినవి ధర్మచయము నహీన ఫణితి.17
192
వావిలాల సోమయాజులు సాహిత్యం-1