Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ద్వాదశలింగ స్తోత్రము '


శా. సౌరాష్ట్రస్థిత సోమనాథు, విలసత్సౌదామనీ దివ్య శో
    భారమ్యాలయు, లోకరక్షణ వ్యాపార శుభ లీలారతున్,
    తారానాథ కళావతంస సుభగున్, తత్త్వార్థ భక్తి ప్రదున్
    జేర న్నే శరణంబు గైకొనెద వాసింగన్న జ్యోతిర్మయున్.

మ. విబుధాసంగ తూలాద్రి తూగ గృహ, ముర్వీధమ్ము శ్రీశైలపు
    బ్రబలోద్యత్ఘన శృంగకేళి భ్రమరాంబా వ్రీణ నాహ్లాదషా
    డబ పీయూష రసార్ణవోజ్జ్వలుని, నొడ్డారంపు సంసార సే
    తు బహూపజ్ఞుని మల్లికార్జునుని గొల్తున్ బ్రీతి కైమోడ్పుతో.

మ. ఘనమై యొప్పచు నయ్యవంచిపురి ప్రాకామ్యత్వ నాల్లభ్యము
    మొనపు న్సజ్జన కోటికిన్ పరమమౌ మోక్షంబున, రక్షించు తా
    తన భక్తావళి, అకాల మృత్యుకృత సంత్రాసమ్ము పోద్రోలి
    యని రక్తిన్ పరమేశు వేడెద భయాహర్తన్ మహాకాళునిన్.

శా. కావేరీ ఘననర్మదా ప్రణయ విఖ్యాతంపు కూటస్థలిన్
    ప్రావీణ్యంబున నొంటియై మహిత మా మాంధాతృరాజతృ
    దేవాగారమునన్ వసించి సుజనోత్తీర్ణ క్రియా కీర్తియై
    కైవారమ్ముల నొందు నీశ్వరుని - ఓంకారేశ్వరుం గొల్చెదన్.

మ. ఇలపై ప్రజ్వలికానిధానమున నయ్యీశాన్యదిగ్భాగ మం
    జులసీమన్ గిరిజాసమేతుడయి - సంశోభిల్లు మృత్యుంజయున్
    ఫలసంధాయకు వైద్యనాథ భవుదీవ్యద్దేవదైత్యార్చితో
    జ్వలపాదాబ్జ, హృదబ్జ మిచ్చుకొని భాస్వద్భక్తి సేవించెదన్.

శా. అక్షయ్యంబగు భక్తి వచ్చి వడిపై నా శాకినీ ఢాకినీ
    రక్షో భూతపిశాచముల్ సుమ సమర్చల్ సేయ రాగిల్లి లో
    దాక్షిణ్యంబునఁ బ్రోచు భక్తహితమందారున్ మహాదేవు, ఫా
    లాక్షున్ వేడెద భీమ శంకరుని లీలాతాండవాటోపునిన్.


110

వావిలాల సోమయాజులు సాహిత్యం-1