పుట:Varavikrayamu -1921.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాంకము

95


రములో నా తండ్రి చేసిన దుస్తంత్రములన్నియు నిచ్చట వెల్లడించుట నా కిష్టము లేదు. పెక్కు మాటలేల?

ఉ. అమ్మెను నన్ను నా జనకుఁడాయన నన్గొనె రొక్కమిచ్చి; యీ
    కొమ్మకు నేను భృత్యుఁడను, గొంకక యే పని సేయు మన్న ని
    క్కముగఁ జేయువాఁడ, నిటు - కట్నములం గొనువారు రూఢిగా
    నమ్మడుకాండ్రె కాక, మగలంటకు నర్హులుకారు లేశమున్‌.

న్యాయా :- సెబాసు నాయనా సెబాసు! చెప్పవలసిన రీతిగాఁ చెప్పితివి! కాన చెప్పినది చెప్పినట్లు చేయుట గూడ జరిగెనేని, లోకమున కొక శ్రేష్ఠమైన పాఠము నేర్పినవాఁడ వగుదువు?

బస :- అయ్యా! తమకా సందేహమేల? (అని కమల వంకకు నడచును.)

లింగ :- (ఆవేదనతో) ఆఁ, ఆఁ, ఆఁ, ఓరి నిర్భాగ్యుఁడా? నిర్భాగ్యుఁడా, నీకేమి వినాశకాలమురా యిది. అయ్యో? అయ్యో? ఇంకేమున్నదింకేమున్నది? (అని గుండె బాదుకొనును.)

బస :- (తిరిగి చూడకయే కమలను సమీపించి) ఓ సుగుణవతీ!

చ. ధనము గణించి నీ యెడల దారుణవృత్తి మెలంగియుండె మ
    జ్జనకుడు, దాని నించుకయు స్వాంతమునందిడఁబోక నన్ను దా
    సునిగ గ్రహించి యిష్టమగు చొప్పున నానతుఁలిమ్ము నీవు చె
    ప్పిన పనిచేయు దెల్ల పుడు భృత్యుఁడనై పడియుండు నీకడన్‌.

కమ :- (మందహాసముతో) ఇదిగో యీ నగల మూటయు నీ కాగితముల కట్టయుఁబట్టుకొని నావెంట రండు. యిరువురమును గలిసి యీ వరవిక్రయ దురాచారమును రూపుమాపుటకై పాటుపడుదుము. (అని మూటయుఁ గట్టయు నిచ్చును.)