పుట:Varavikrayamu -1921.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

వరవిక్రయము

వెంగ :- ఇదో ఫోర్జరీ, యిందుకోసం యీయన మీద కూడా ప్రాసిక్యూషనుకు ఆర్డరు దయచేయించాలి. ఇక వూరుకోవడానికి వీల్లేదు.

కమ :- అయ్యా! ఆయననేమియు నెఱుంగరు, నాకుఁగల హక్కును బట్టియఁ న్యాయమును బట్టియు నేనే ఈ విధముగా మార్చినాను. అందులకు వారప్పుడేమియు నభ్యంతరము చెప్పి యుండలేదు. తామీ సందర్భములన్నియుఁ జక్కఁగా నాలోచించి, నాపై నాభర్తకే యధికారము గలదో, నాభర్తపై నాకే యధికారము కలదో, నిర్ణయింపుఁడు.

బస :- (తనలో) నా యవజ్ఞచేతనే యీవ్యవహార యింతవఱకు వచ్చినది. ఇంకను నేనిట్లు మొరడునై యుండఁదగునా?

చ. పరువు నశించెఁ! బండితులు బామరులు న్విని యింట నింట నా
    చరితమె చెప్పుకొంచు నెకసక్కెములాడు నవస్థపట్టె! ము
    ష్కరమునఁ దండ్రి కిప్పటికి గల్గకపోయె నుదార బుద్ధి! యీ
    తరుణము నందు మూర్ఖుని విధంబున నుండుట నాకుఁబాడియే!

గీ. ఆమె చెప్పినదెల్ల యధార్థ మీతఁ
   డాచరించినదెల్ల నా యాత్మ యెఱుఁగు
   నిట్టిచో న్యాయమున కేసు గట్టువడక
   యున్న దేవుఁడు నను జూచి యోర్చువాఁడె.

న్యాయా :- ఏమి వెంగళప్పగారూ! మీరేమి చెప్పెదరు?

బస :- (యింతలో ముందునకు వచ్చి) అయ్యా! యిప్పుడు మాటాడవలసినవాఁడను నేను గాని, ఆయన గాదు. ఈ దావాకు సంబంధించిన కాగితములపై నేను సంతకములు చేసినది, నా తండ్రి బలవంతముచేఁగాని, నా స్వబుద్ధిచేఁ గాదు. అందువల్ల నా దావాను నేను రద్దు చేసికొనుచున్నాను. ఆ చిన్నది చెప్పిన మాటలలో నణువంతయు నసత్యము లేదు. నా తండ్రి మాటలలో నలుసంతయు నిజములేదు. ఈ వ్యవహా