పుట:Varavikrayamu -1921.pdf/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

వరవిక్రయము

న్యాయా :- న్యాయాధిపతిగాఁగాక గృహస్థుడుగా నడుగుచున్నాను.

పురు :- ఇది న్యాయస్థానము కాని తమ గృహము కాదు.

న్యాయా :- అట్లయిన నీ వ్యవహారమిఁక నిరుపక్షములకు అనుకూలముగా నిర్వర్తించుట కవకాశము లేదన్న మాటయే!

వెంగ :- ఆ సంగతి నే నాదిలోనే మనవి చేశాను.

కమ :- (తనలో)

మ. మనసూ! జంకకు, ధైర్యమా! చెడకుమీ మానంబు! నీమానశో
    ధనకాల బిదె, దైవమా! యిపుడె చెంతంజేరి సాయంబు స
    ల్పి ననుం దేల్చు ముహూర్త మిత్తఱిని దల్లీ! భారతీ నాదు వా
    క్కున నిల్వంబడు మక్కరో కదిసి నాకుం దోడుగా నుండుమీ!

న్యాయా :- అందుచేతనె మీరు వకీలును బెట్టుకొనలేదన్నమాట.

కమ :- (కొంచెము ముందునకు వచ్చి) అయ్యా! తామధిష్ఠించినది ధర్మపీఠము, తాము ధర్మదేవతకుఁ బ్రతినిధులు. తమ కాఁడు బిడ్డయున్నయెడల నాబిడ్డయె యీ బిడ్డ యనుకొని తమ సన్నిధానమున ధర్మము విన్నవించుకొనుటకు నా కనుజ్ఞ దయచేయుడు!

వెంగ :- (చివాలున లేచి) నో! నో! నో! ఆ చిన్నది మాట్లాడడము అశాస్త్రీయం. అందుకు లా యెంతమాత్రం వప్పదు. ఏదీ సివిల్‌ ప్రోసీజరు కోడెక్కడుంది. (అని బల్ల మీఁద వెదకును.)

న్యాయా :- ఏమీ? ఏల మాటాడఁగూడదు?

వెంగ :- ఆ పిల్లకు మైనార్టీ వెళ్ళలేదండి. మైనారిటీ వెళ్ళని వాళ్ళు మాటలాడ గూడదని బోలెడు బొంబాయి తీర్పులున్నాయి.

కమ :- అయ్యా! చట్టము వేఱు, సందర్భము వేఱు, సందర్భములను బట్టి చట్టములు మారునుగాని, చట్టములనుబట్టి సందర్భములు మాఱవు.