అష్ఠమాంకము
85
రెండవ రంగము
(ప్రదేశము: కమల గది.)
కమ :- (నూలు వడుకుచు) కనుకనే పెద్దలు కదురు తిరిగినను కవ్వము తిరిగినను కాటకముండదని చెప్పుదురు. సందియ మేమి?
గీ. రాట్నపుం జక్ర మిటు లహోరాత్రములును
గాలచక్రంబు కైవడిఁ గదిలెనేని
విష్ణుచక్రంబువలె క్షామ విదళనంబు
చేసి, భూచక్రమెల్లను జెతనిడదె!
ఎందుకుఁ జెపుమా నాన్నగారు వచ్చుచున్నారు! (అని లేచును.)
పురు :- (కాగితము చేతఁబట్టుకొని ప్రవేశించి) అమ్మా వియ్యంకుఁడుగారు చివరకు వీధి కెక్కినారు! ఇదిగో నోటీసు.
కమ :- ఏమని?
పురు :- చదివెద వినుము. (అని యిట్లు పఠించును.)
బి. యే. బి.యల్. హైకోర్టు వకీలు వెర్రిబుర్రల వెంగళప్పగారి వద్ద నుంచి, పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి, అయ్యా! మా క్లయింటు సింగరాజు బసవరాజుగారికి మీ కొమార్తె కమలను యివ్వడం మూలకంగా వివాహం కాబడ్డట్టున్నూ, వివాహ కాలములో మా క్లయింటు మీపిల్లకు నాలుగువేలు రూపాయల కిమ్మత్తు గల నాణెమైన బంగారపు నగలు వుంచబడ్డట్టున్నూ సదరు నగలను మీరు హరించడానికి దురుద్దేశముతో, సదరు చిన్నదాన్ని కాపరానికి పంపకుండా వుండబడ్డట్టున్నూ, మీపైన దావా వగైరా చర్య జరిగించేదిగా మాకు సమజాయిషీ ఇవ్వబడివున్నారు. ఈ నోటీసు అందిన ఇరువది నాలుగు గంటలలోగా సదరు వస్తువులు సహితం పిల్లను కాపురానికి పంపబడి మావల్ల క్రమమైన రసీదును పొందకుండా వుండబడే యెడల మీ వగైరాలపైన దావా చెయ్యడమే కాకుండా, మీవల్ల యావత్తు ఖర్చులున్నూ రాబట్టుకోబడడం యిందుమూలముగా తెలియజేయడమైనది. ఈ నోటీసు తాలూకు ఖర్చులుగూడా పిల్లతో పంపబడేది కాబడుతుందని చిత్తగింపవలెను.
-వెఱ్రిబుఱ్రల వెంగళప్ప.